ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్

ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచగొండుల రాజ్యమేలుతారని చెప్పారు. ఆసిఫాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలో లో మాట్లాడారు.  ధరణి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ధరణి లేకపోతే  పట్టా ఇవ్వడానికి ఆరు నెలలసమయం పడుతుందన్నారు. రైతు చనిపోతే  ధరణి వల్ల రూ.5లక్షల బీమావస్తుందన్నారు. 

ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే 47 వేల పోడు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ అన్నారు. అంతేగాకుండా పోడు రైతులకు ఈ పంట నుంచే రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో  అన్ని భూములకు త్రిఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు.  పోడు  రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆసిఫాబాద్ లో  3 నుంచి 4 వేల గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలను చేశామన్నారు కేసీఆర్. తెలంగాణ వచ్చాక గిరిజన,తండా ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పారు. తెలంగాణ వచ్చింది కాబట్లే  ఆసిఫాబాద్ జిల్లా వచ్చిందన్నారు.  మిషన్ భగీరథ ద్వారా మన్యంకు  మంచినీళ్లు అందించామని తెలిపారు.  నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చుతామన్నారు.  

తెలంగాణ పథకాలు కావాలని మహారాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని చెప్పారు కేసీఆర్.  దేశంలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనేనన్నారు.  ఆసిఫాబాద్ జిల్లాలోని  335 గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు.. కాగజ్ నగర్ మున్సిపాలిటీ ,ఆసిఫాబాద్  మున్సిలలిటీలకు ప్రత్యేకంగా రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. వార్దానదిపై బ్యారేజీ నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని తెలిపారు.