- సమ్మె చట్ట విరుద్ధం: సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని సీఎం కేసీఆర్ అన్నారు. యూనియన్లు చేస్తున్న పని మహా నేరం, మహా పాపం అని చెప్పారాయన. వీళ్ల రాజకీయాలతో అమాయక కార్మికుల గొంతు కోస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి ముగింపే సమ్మె ముగింపని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం వచ్చాక తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
స్వయంగా కార్మికులే ముంచుకున్నరు
ఎస్మా కొత్తగా పెట్టేదేం లేదని, అల్రెడీ ఎస్మా ఉండగానే వారు సమ్మెకు వెళ్లారని, ఇది చట్ట వ్యతిరేకం అన్నారు. ఆర్టీసీ సంస్థను స్వయంగా కార్మికులే ముంచుకుంటున్నారన్నారు. బుద్ధీ జ్ఞానం లేని సమ్మె ఇది అని, సంస్థ మనుగడ కోరుకునే వాళ్లెవరూ ఈ పని చేయరని అన్నారు.
ఆర్టీసీ కథ ముగిసింది
ఆర్టీసీ కథ ముగిసిందని, ఇక ఉండబోదని చెప్పారు. ఈ సమ్మె ఫలితం 1000 శాతం ఇక పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదని అన్నారు కేసీఆర్. పాత ఆర్టీసీ బతికే పరిస్థితి లేకుండా చేసింది ఈ యూనియన్లు, వారికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీలేనని చెప్పారు.

