తెలంగాణకు బీజేపీ ఎన్నడూ కనెక్ట్ కాలేదు : కేసీఆర్

తెలంగాణకు బీజేపీ ఎన్నడూ కనెక్ట్ కాలేదు : కేసీఆర్

బీజేపీ వాళ్లను ప్రజలు నమ్మరు: సీఎం కేసీఆర్​

సెంటిమెంట్లు రెచ్చగొట్టి రెండోసారి గెలిసిండ్రు

ఇక్కడ నలుగురు ఎంపీల గెలుపు కూడా అపవిత్రమే

కాంగ్రెస్‌తో కూడితేనే అదైనా సాధ్యమైంది

మనకు నిధులు ఇవ్వలేదు..  మీదికెల్లి నీతి ఆయోగ్‌కు రాలేదంటరు

ద్రవిడ పార్టీల్లా టీఆర్​ఎస్​ బలంగా ఉంది

90 శాతం పార్టీ సభ్యత్వాలు పూర్తయినయ్

వందేళ్లు నిలబడేలా పార్టీ ఆఫీసులు కట్టిస్తాం

పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ కామెంట్స్

హైదరాబాద్‌, వెలుగు:   ‘రాష్ట్రంలో బీజేపీ నిల్వదు. ఆ పార్టీని ప్రజలెవ్వరూ నమ్మరు. పుల్వామా, బాలాకోట్‌లాంటి దాడులను సాకుగా చూపి, ప్రజల్లో సెంటిమెంట్లు  రెచ్చగొట్టి మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో గెలిచిండ్రు. రెండోసారి గెలిచినా వాళ్లు ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనీ చేయలేదు. వాళ్లతోని ఏమీ కాదు’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక్కడ టీఆర్​ఎస్సే బలంగా ఉందని, బీజేపీకి గానీ, ఇతర ఏ పార్టీకి గానీ స్థానం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లు అపవిత్ర కలయికతోనే సాధ్యమయ్యాయని, కాంగ్రెస్‌తో కలిసిపోయే ఆ సీట్లను గెలుచుకున్నారని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ ముఖ్యులతో జరిగిన భేటీలో ఆయన పలు రాజకీయ అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. టీఆర్​ఎస్​ వర్గాల సమాచారం మేరకు సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి..

కేంద్రం నుంచి నిధులు రాకున్నా ఫికర్​ లేదు

‘వాళ్లు బీజేపీ రాష్ట్రాలను ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్ని మరో తీరుగా చూస్తున్నరు. ఏపీ, తెలంగాణను ఒక రకం గా చూస్తున్నరు. మొన్న బడ్జెట్‌లో మనకు నిధులే ఇవ్వలేదు. రాజ్యాంగపరంగా రావా ల్సినవి తప్ప అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ చెప్పినా చెవికెక్కించుకోలేదు’ అని కేసీఆర్​ అన్నారు.
మిషన్‌ భగీరథ, కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘మనకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మీదికెళ్లి ‘రావ్‌ సాబ్‌.. నహీ ఆయా’ అంటూ అడుగుతుంటే ఏమనాలె? మొన్న నీతి ఆయోగ్‌కు నేను వెళ్లకపోతే మోడీ అట్ల అడిగిండట. అక్కడికి పోయి ఏం లాభం? మనకు కాళేశ్వరంలాంటి బృహత్తర కార్యక్రమం ఉండి వెళ్లలె’ అని కేసీఆర్‌ తెలిపారు.  కేంద్రం నిధులు రాకున్నా ఫికర్‌ లేదని, రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనీ ఆగదని స్పష్టం చేశారు.

ఇంటింటికి నీళ్లొస్తున్నయ్​

‘మన ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తున్నది. ఇంతకన్నా ఏ ప్రభుత్వం మంచి చెయ్యలె. మన పథకాలే మనకు శ్రీరామరక్ష’ అని నేతలతో కేసీఆర్​ అన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి నీళ్లు వస్తున్నాయని, మొన్న ఎండ కాలంలో  ఆ నీళ్లే ఇచ్చినట్లు చెప్పారు. గతంలో ఎండ కాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని పెద్ద పెద్ద క్యూలు ఉండేవని, వాటర్​ బోర్డు ముందు ఆందోళనలు జరిగేవని, ఇప్పుడవన్నీ ఏం లేవని పేర్కొన్నారు. ‘‘ఇంకా కొన్ని ఇండ్లకు నీళ్లు రావాలె.. ఆ ఇండ్లకు  కూడా నీళ్లు వస్తయ్. కాళేశ్వరం నుంచి కూడా నీళ్లు వస్తయ్. పంటలకు, తాగడానికి పుష్కలంగా సరిపోతయ్’’ అని తెలిపారు.

మున్సి‘పోల్స్’​కు సిద్ధంకండి

త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్​ సూచించారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. అర్బన్‌లో బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, పైచేయి టీఆర్‌‌ఎస్‌దేనని ఆయన అన్నారు.

ద్రవిడ పార్టీల్లా టీఆర్​ఎస్​ బలమైన పార్టీ

సభ్యత్వ నమోదులో టీఆర్​ఎస్​ దూసుకుపోతున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 90% సభ్యత్వాలు పూర్తయ్యాయని, ఇంకో పది పర్సెంట్‌ మిగిలిందని, అది కూడా రేపోమాపో అయిపోతుందని తెలిపారు. ‘‘ద్రవిడ పార్టీల్లా మనది బలమైన పార్టీ. వందేండ్లైనా నిలిచి ఉండేలా బలమైన పునాది వేయాలె. సభ్యత్వ నమోదు కాగానే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు వేస్తం. తర్వాత మండలాల్లో వేద్దం. అన్ని స్థాయిలో అనుబంధ సంఘాలకు కార్యవర్గాన్ని నియమిస్తం. అన్ని అయిపోనంక రాష్ట్ర కమిటీ ప్రకటిస్తం’’ అని ఆయన పేర్కొన్నారు.