ఫామ్​హౌస్​కు వచ్చి ఎవుసం చేస్కుంట : కేసీఆర్

ఫామ్​హౌస్​కు వచ్చి ఎవుసం చేస్కుంట : కేసీఆర్
  • అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపు
  • ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్

ములుగు, వెలుగు: ఎర్రవల్లి ఫామ్​హౌస్​కు వచ్చి ఎవుసం చేసుకుంటానని, అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. ఆరోగ్యం బాగుందని, పది రోజుల్లో వస్తానని తెలిపారు. గజ్వేల్​లో అందరిని కలుస్తానని పేర్కొన్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత నుంచి హైదరాబాద్​ నందినగర్​లోని ఇంట్లో ఉంటున్న కేసీఆర్​.. ఆదివారం ములుగు మండలం వంటిమామిడిలోని బాపురెడ్డికి ఫోన్​ చేశారు. 

రెండు, మూడు రోజుల్లో ఎరువులన్నీ పంపాలని కోరారు. అలాగే పంపిస్తానని బాపురెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి అవసరమైన పురుగుల మందులతో పాటు ఇతర సామగ్రి గురించి కేసీఆర్ ను బాపురెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘సార్.. మీ ఆరోగ్యం ఎట్లున్నది..’’అని బాపురెడ్డి అడగ్గా.. ‘‘నేను బాగున్నాను.. ఇబ్బందేం లేదు.. ఫామ్​హౌస్​ కు వస్తున్న.. ఎవుసం చేస్కుంటా..”అని కేసీఆర్ సమాధానం చెప్పారు.

‘‘మీరు చెప్పిన ఎరువులు.. విత్తనాలు.. పురుగుల మందులు పంపిస్తా”అని కేసీఆర్​కు బాపురెడ్డి జవాబిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు మూడు నిమిషాల పాటు బాపురెడ్డితో మాట్లాడారు. కొన్నేండ్లుగా ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్​కు బాపురెడ్డినే ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నారు. డిసెంబర్ 7న అర్ధరాత్రి ఎర్రవల్లి ఫామ్​హౌస్​​లో కేసీఆర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయన్ను హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్ తీసుకెళ్లి హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేశారు. కొద్ది రోజులు హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకున్న కేసీఆర్.. తర్వాత నందినగర్​లోని ఆయన సొంతింట్లో ఉంటున్నారు.

నేడు ఫామ్​హౌస్​​కు కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్.. సోమవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్​హౌస్​​కు వెళ్లనున్నారు. అక్కడే సంక్రాంతి జరుపుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. కొన్ని రోజులు ఫామ్​హౌస్​​లో ఉండి.. తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​కు వెళ్తారు. అక్కడ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉండేలా లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తెలంగాణ భవన్​కు వస్తారని తెలిసింది. ఇక్కడ కూడా కొన్ని రోజుల పాటు పార్టీ లీడర్లు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేత కావడంతో కేబినెట్ హోదాలో కేసీఆర్ కోసం కుందన్​బాగ్​లోని ఓ క్వార్టర్ సిద్ధం చేసినట్టు తెలిసింది. నందినగర్​లోని తన సొంత ఇంటికి ఇరుకైన రోడ్డు ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందనే.. కుందన్​బాగ్​లోని క్వార్టర్​కు షిఫ్ట్ కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.