పాత హామీలనే కొత్తగా చెప్పిన కేసీఆర్

పాత హామీలనే కొత్తగా చెప్పిన కేసీఆర్
  • పాత హామీలనే కొత్తగా..
  • సాగర్ ఎన్నికల్లో చెప్పినవే హాలియా సభలో రిపీట్ చేసిన కేసీఆర్
  • లోకల్​బాడీలకు రూ.200 కోట్లు ఇస్తామని పైసా ఇయ్యలే
  • ఇప్పుడు రూ.150 కోట్లు శాంక్షన్ చేస్తమని మరోసారి ప్రకటన
  • హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదంటున్న జనం

నాగార్జున సాగర్​ బైపోల్​ సందర్భంగా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్ల విలువైన హామీలిచ్చారు. వాటికి పైసా రిలీజ్​ చేయలేదు. గిరిజనుల పోడు భూముల సమస్య అలాగే ఉండిపోయింది. ఇరిగేషన్ ​జాగాలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు పట్టాలివ్వలేదు. జీవోలు, శిలాఫలకాలు తప్ప ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు హాలియా వేదికగా జరిగిన సమీక్షలో మరోసారి పాత హామీలనే సీఎం కేసీఆర్ రిపీట్ చేశారు.

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్​ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. రూ.3 వేల కోట్ల విలువైన హామీలు ఇచ్చినా పైసా రిలీజ్​చేయలేదు. గిరిజనుల పోడు భూములకు, ఇరిగేషన్​ జాగలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు పట్టాలిస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఎంతసేపు జీవోలు, శిలాఫలకాలు తప్ప ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు హాలియా వేదికగా సోమవారం జరిగిన ప్రగతి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి పాత హామీలనే రిపీట్ చేశారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు సహా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తామని తాజాగా ప్రకటించారు. అవి గతంలో పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇస్తామన్న రూ.200 కోట్లలో భాగమా, లేక కొత్తగా ఇవ్వబోతున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. మళ్లీ అవే హామీలను కొత్తగా ప్రకటించడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదని అంటున్నారు.

వందల కోట్ల హామీలు
నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్ ఇదే హాలియా వేదికగా ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. నెల్లికల్లు సహా 15 లిఫ్టు స్కీంలకు రూ.2,500 కోట్లు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, 31 మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున, నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున సుమారు రూ.200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క పంచాయతీకి, మండలానికి, మున్సిపాలిటీకి పైసా కూడా రిలీజ్ కాలేదు. జీపీలకు, మున్సిపాలిటీలకు, మండలాల కేంద్రాలకు స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద నిధులు ఇస్తున్నట్లు జీవో ఇచ్చారు. కానీ వాటిని ఎలా ఖర్చు పెట్టాలనే దానిపై ఇప్పటికీ గైడ్​లైన్స్ రాలేదు. ఈ వర్క్స్​కు సంబంధించి ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే ప్రపోజల్స్ రెడీ చేసి ఆఫీసర్లకు పంపుతున్నారు. అవి ఎప్పుడు ఆమోదం పొందుతాయో, ఎప్పుడు పనులు జరుగుతాయో, ఎప్పుడు ఫండ్స్ రిలీజ్​ అవుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు తమ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేలే ప్రపోజల్స్​ పంపుతుండడంపై సర్పంచ్‌‌లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్​పర్సన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

లిఫ్టు స్కీంల వద్ద వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
దేవరకొండ, నాగార్జునసాగర్​, మిర్యాలగూడ, నకిరేకల్, కోదాడ, హుజూర్​నగర్ నియోజకవర్గాల్లో దాదాపు 15 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. అన్నిచోట్లా శిలాఫలకాలు తప్ప ఎలాంటి ప్రోగ్రెస్​ లేదు. 11 లిఫ్టులకు అప్పట్లోనే శాంక్షన్​ఇచ్చినా నెల్లికల్లు, అయిటిపాముల,  వీర్లపల్లి, తోపుచర్ల లిఫ్టులకు అది కూడా దిక్కులేదు. దీనిపై విమర్శలు వస్తాయని భావించి.. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ నాలుగింటికి శాంక్షన్ ఇస్తూ సోమవారం జీవోలు జారీ చేశారు. సాగర్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ లిఫ్టులను ప్రకటించారనే ఆరోపణలు వచ్చాయి. అందుకు తగినట్లే ఇప్పటిదాకా ఏ ఒక్క లిఫ్టుకూ టెండర్లు పిలవలేదు. ఈలోపే నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అంచనా వ్యయం రూ.1,700 కోట్లకు పెరగడంతో దానికి మళ్లీ ఫారెస్ట్, హైడ్రాలిక్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. వీటికితోడు సోమవారం కొత్తగా గుర్రంపోడు లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీంను ప్రకటించిన సీఎం.. సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు.

మిగతా హామీలదీ అదే పరిస్థితి
నందికొండలోని నాగార్జున సాగర్ క్వార్టర్స్​లో ఉంటున్న వాళ్లకు, ఇరిగేషన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లకు పట్టాలిప్పిస్తామని గతంలో సీఎం చెప్పారు. జీవో రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ ఎన్నికల్లో నోముల భగత్ గెలిచాక సాగర్ వచ్చి అందరికీ హక్కు పత్రాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో క్వార్టర్లు, ఇండ్ల సర్వే కోసం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇక గుర్రంపోడు వ్యవహారం సాగర్ ఎన్నికల పై ఎఫెక్ట్​చూపకుండా ఎస్టీలందరికీ పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఆఫీసర్లు మీద పోడుభూముల సర్వే చేశారు. గిరిజనులకు పట్టాలు వచ్చినట్లే అన్నంత హడావుడి చేశారు. కానీ పరిస్థితి మారలేదు. గొర్రెల పంపిణీ సహా అనేక హామీలు అమలుకాలేదు. సోమవారం జరిగిన ప్రగతి సమీక్ష సమావేశంలో పాత హామీలనే సీఎం వల్లె వేశారు. పేరుకు ప్రగతి సమీక్ష అయినా.. ఏ ఒక్క స్కీములోనూ ప్రోగ్రెస్​ లేదనే విషయం కేసీఆర్ మాటలతో అర్థమైపోయింది.