దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం

దళిత బంధు కేవలం  కార్యక్రమం కాదు ఉద్యమం

తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు... ఉద్యమం అన్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటుందన్నారు. మనలో పరస్పర విశ్వాసం.... సహకారం పెరగాలన్నారు. కక్ష, ద్వేషాలు మానాలని సూచించారు. రాష్ట్రంలో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు  కేసీఆర్. దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ది చెందాలన్నారు.  గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలన్నారు.

బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో జరిగిన దళిత బంధు అవగాహన సదస్సుకు మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు, అధికారులు.. హుజురాబాద్ దళిత ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్థికంగా పటిష్టమైన నాడే దళితులు వివక్ష నుంచి దూరం అవుతారన్నారు  కేసీఆర్. దిళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే... దళితుల అభివృద్ధితో పాటు... తెలంగాణ అర్ధికాభివృద్ధికి దారులు పడతాయన్నారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు ఆర్ధిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు సర్కార్ రిజర్వేషన్లు కల్పిస్తుందన్నారు. 

దళిత బంధు పథకంలో భాగంగా... ఫైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ ను ఎంపిక చేసింది ప్రభుత్వం. దీంతో ఆ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితులు, మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు, ఆఫీసర్లు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, మున్సిపాల్టీల్లోని ప్రతీ వార్డు నుంచి నలుగురు చొప్పున దళితులు సమావేశానికి హాజరయ్యారు.  గ్రామాలు, మున్సిపల్ వార్డుల నుంచి వచ్చే నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఆహ్వానించారు.  ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ కు తీసుకువచ్చారు అధికారులు. దళితబంధు స్కీం ఉద్దేశం, అమలు, పర్యవేక్షణ, నిర్వహణ అంశాలపై సదస్సులో అవగాహన కల్పించారు  కేసీఆర్.