
రామమందిర నిర్మాణంపై మీ వైఖరేంటి అని అడిగిన రాష్ట్ర బీజేపీ నాయకులకు ఘాటైన రిప్లై ఇచ్చారు ముఖ్యమంత్రి , గులాబీ బాస్ కేసీఆర్. నిజామాబాద్ లో లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కేసీఆర్.. ప్రధానమంత్రి మోడీ తీరుపై మండిపడ్డారు. “ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ప్రజలకు నీళ్లు, ఆహారం, వసతులు అందుతున్నాయా లేదా అనేది చూడాలి గానీ.. రామజన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, సత్యభామ జన్మభూమి, శూర్పనఖ జన్మభూమి.. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాల్నా..? ఏ జన్మభూమి ఎవరిదో.. ఏది ఎక్కడుండాలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మ ప్రచారకర్తలు లేదా.. న్యాయస్థానాలు నిర్ణయం చేయాలి. ఇది మన రాజకీయ నాయకుల పనికాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నీళ్లు, కరెంట్ ఇవ్వాలి. యువతకు ఉద్యోగాలు ఇప్పించాలి. జన్మభూమి అని మాట్లాడితే జనం బతుకులు మారవు” అని అన్నారు కేసీఆర్.
“మాట్లాడితే హిందూ అని అంటారు. మేం హిందువులం కాదా.. పిల్లగాండ్లు పుడితే 21 దినం చేస్కుంటలేమా. పెళ్లిళ్లు చేస్తలేమా అయ్యగార్ని పిలిచి. ఎవరైనా చనిపోతే తద్దినాలు పెట్టుకుంటలేమా. గుళ్లకు పోతలేమా. గుండు కొట్టించుకుంటలేమా. బీజేపీ వాళ్లు చెబితేనే పోతున్నమా మనం. ఎంత గరీబోడైనా దేవుడి ఫొటో ఉంటది. ఇతర మతాలను తిట్టేవాడే హిందువు అని హిందూత్వం చెప్పలేదు. అందరినీ గౌరవించమని చెప్పింది హిందూమతం. అందరినీ ప్రేమించుమని చెప్పింది. మీదేమో రాజకీయ హిందూత్వం. మాది నిజమైన హిందూత్వం. మాది దేవుడిని నమ్మే హిందూత్వం. మాది ఆధ్యాత్మిక హిందూత్వం. లక్ష్మణ్ గారూ.. మీరు డూప్లికేట్ హిందువులు. చాలారోజులు మీ ఆటలు సాగయ్. అన్ని వర్గాలు బాగుండాలి.. ప్రజందరూ బాగుండాలి. పలానోన్ని తిట్టుమని మన వేదాలు చెప్పలేదు. అన్నిమతాలు, అన్ని వర్గాలు అందరు బాగుండాలని మేం చెప్తున్నం. ఓట్లకోసం చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతున్నారు” అని అన్నారు కేసీఆర్.