Pawan Kalyan: అమావాస్య రోజు 'హరిహర వీరమల్లు' విడుదల.. ఇది సాహసమా, వ్యూహమా?

Pawan Kalyan:  అమావాస్య రోజు 'హరిహర వీరమల్లు' విడుదల.. ఇది సాహసమా, వ్యూహమా?

తెలుగు సినీ ప్రియులకు జూలై 24, 2025 ఒక కీలకమైన రోజు.  జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 'హరిహర వీరమల్లు' ( Hari Hara Veera Mallu  ) చిత్రం విడుదల కాబోతోంది.  ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.  అయితే ఈ విడుదల తేదీపై ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. కారణం, అదే రోజు అమావాస్య కావడం. తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యను శుభకార్యాలకు పనికిరాని రోజుగా భావించే సంప్రదాయం ఉంది.   మరి ఇలాంటి నమ్మకాలు బలంగా ఉన్న చోట , అగ్రశ్రేణి హీరో సినిమాను అమావాస్య నాడు విడుదల చేయడం చేయడం సాహసమా? లేక చిత్ర బృందం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయామా? అన్న దానిపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అమావాస్య నమ్మకాలు - సంప్రదాయ బద్దమైన ఆచరణ
తెలుగు ప్రజల దైనందిన జీవితంలో పండుగలు, పబ్బాలతో పాటు తిథులు, నక్షత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా, అమావాస్యను చాలామంది అశుభకరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు నిర్వహించడం అస్సలు చేయరు. ఒకవేళ చేస్తే అవి అరిష్టాలకు దారితీస్తాయని, అనుకోని ఆటంకాలు ఎదురవుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చాలా కుటుంబాలు తమ పెద్దల మాటను గౌరవించి, అమావాస్య రోజున ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరు.  సినిమా రంగంలో కూడా ఈ నమ్మకాల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.  కొత్త చిత్రం  షూటింగ్ కూడా శుభ ఘడియలు ఉన్న సమయంలోనే  ముహూర్తం చూసుకునే ప్రారంభిస్తారు. విడుదలను కూడా అదేవిధంగా ఫాలో అవుతారు. అయితే  గతంలో అనేక సందర్భాల్లో చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు అమావాస్య రోజున సినిమాలను విడుదల చేయడానికి వెనుకాడారు. మంచి ముహూర్తం చూసి విడుదల చేస్తే సినిమాకు శుభం కలుగుతుందని, వసూళ్లు బాగుంటాయని నమ్మేవారు. అయితే, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' వంటి భారీ చిత్రం అమావాస్య రోజున విడుదల కావడం గమనార్హం.

వ్యూహాత్మక విడుదల?
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి చెప్పాలంటే, ఇది చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే, సినిమాలకు కూడా సమయం కేటాయించడం, ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు కలెక్షన్లను కురిపించడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.  అమావాస్య రోజున విడుదల వెనుక చిత్ర బృందం వ్యూహాత్మక ప్రణాళికను రచించి ఉండవచ్చు.

సాధారణంగా శుక్రవారం సినిమా విడుదల చేస్తారు, కానీ జూలై 24, 2025 గురువారం అవుతుంది. ఈ విడుదల గురువారమే కావడంతో, చిత్రానికి శుక్ర, శని, ఆదివారాలు కలిసి మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభిస్తుంది. అమావాస్య నాడు ప్రజలు పెద్దగా బయట పనులు పెట్టుకోరు కాబట్టి, సాయంత్రం వేళల్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపించవచ్చు. పైగా, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు తిథులతో సంబంధం లేకుండా, కేవలం ఆయన స్టార్‌డమ్‌పైనే సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయని చిత్ర నిర్మాతలు భావించి ఉండవచ్చు అని సినీ వర్గాలతో పాటు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

'హరిహర వీరమల్లు' అమావాస్య నాడు విడుదల కావడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా, సాంప్రదాయవాదులు, అమావాస్య నమ్మకాలను బలంగా పాటించేవారు ఈ రోజున సినిమా చూడటానికి వెనుకాడవచ్చు. దీనివల్ల తొలి రోజు వసూళ్లపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.  కానీ, మరికొందరు పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్, సినిమాపై ఉన్న హైప్ ఈ అడ్డంకిని అధిగమించవచ్చని భావిస్తున్నారు. 

 

ఈ చిత్రానికి  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ట దర్శకత్వం వహించారు.  పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,  గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది . ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపు అయ్యింది.  ఎన్నో అటంకాలు తట్టుకుని వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చాడాలి మరి.