అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు.. డౌట్ రాకుండా కార్లలో లోడింగ్.. 9 మంది అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు.. డౌట్ రాకుండా కార్లలో లోడింగ్.. 9 మంది అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబిగ్ నిర్వహించి ఎంత మందిని పట్టుకుంటున్నా.. ఎర్రచందనం స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో వెళితే డౌట్ వస్తుందని.. కొత్తగా కార్లలో వచ్చి.. అదే కార్లలో ఎర్రచందనం దుంగలను తరలించాలని  ప్లాన్ చేస్తూ పట్టబడ్డారు. సోమవారం (జులై 21) అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

బాలపల్లి అడవుల్లో స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి టీమ్ ను అలర్ట్ చేశారు. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించారు. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కె. కృపానందకు, ఏఆర్ ఎస్ఐ ఎన్. బాల చెన్నయ్య, స్థానిక ఎఫ్బీఓ సుబ్బలక్ష్మి  టీమ్  కలసి దేశెట్టిపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో కూంబింగ్ చేస్తూ బాలపల్లి అటవీప్రాంతం చేరుకున్నారు. 

అక్కడ  రెండు కార్లతో కనిపించిన  9మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు.  నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినా పోలీసులు చాకచక్యంతో అరెస్టు చేశారు. నిందితులను  నంద్యాల, అన్నమయ్య జిల్లాలతో పాటు కర్ణాటక కు చెందిన వారిగా గుర్తించారు. వాహనంలో లోడ్ చేసిన 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్  పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.