మోటార్ల రిపేర్ల ఖర్చును జనంపై మోపితే ఊరుకోం

మోటార్ల రిపేర్ల ఖర్చును జనంపై మోపితే ఊరుకోం

మంచిర్యాల/జైపూర్/బెల్లంపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు డిజైనింగ్​ కారణంగానే కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​లు మునిగిపోయాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్, మేఘా కాంట్రాక్టర్లే పంపుహౌస్​లకు జరిగిన నష్టాన్ని భరించాలని డిమాండ్​ చేశారు. మోటార్ల రిపేర్ల ఖర్చును జనంపై మోపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తోనే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఊళ్లు, పంటలు నీట మునిగాయని, భద్రాచలం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్..​ కాళేశ్వరం ముంపు బాధితులు నిలదీస్తారనే భయంతోనే ఇటువైపు రాలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం కట్టారని, రూ.40 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుబారా చేశారని మండిపడ్డారు.

మత్స్యకారులు, వరద బాధితులకు సాయం

ఆదివారం మంచిర్యాల జిల్లాలో వివేక్​ పర్యటించారు. జైపూర్​ మండలం వేలాలలో ఇటీవల వరదలతో ఉపాధి కోల్పోయిన 20 మంది మత్స్యకారులకు వలలు, ఇతర సామగ్రిని ఆయన అందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్​ నగర్​లో ఇండ్లు కూలిపోయిన బాధితులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆధ్వర్యంలో సిమెంట్​ బస్తాలు, రేకులు అందజేశారు. వరదలతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, నెలరోజులు గడిచినా ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదని పలువురు వివేక్​ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వరదలతో ఇండ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి బీజేపీ తరపున అండగా ఉంటామని రఘునాథ్​రావు అన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. వివేక్​ లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పొనుగోటి రంగారావు, మంచిర్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్​ గౌడ్, జైపూర్​ మండల అధ్యక్షుడు చల్లా విశ్వంభర్​రెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, బి.కేశవరెడ్డి, రాజులాల్ యాదవ్, కొయిల్కార్ గోవర్దన్ 
తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం ఇచ్చిన రూ.3 లక్షల కోట్లు ఏం చేసినవ్?

మిగులు బడ్జెట్  రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో  ముంచేశారని వివేక్ అన్నారు. కేంద్రం రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, వాటిని ఎక్కడ ఖర్చుపెట్టారో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలకు కలుషిత నీరు తాగిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 70 సీట్లకుపైగా బీజేపీ గెలుచుకుని అధికారంలోకి వస్తుందని వివేక్ ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో గ్రామగ్రామాన బీజేపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు ఎగురవేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్, టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్  ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా 600 మెగా మోటార్ సైకిల్ ర్యాలీ లో వివేక్ పాల్గొన్నారు.