ఈ అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి

ఈ అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్ :  సీఎం కేసీఆర్ బుధవారం నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

  • గిరిజనులు, లంబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్న మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
  • తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు చెందినటువంటి వేల ఎకరాల భూమిని బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అక్రమంగా ఆక్రమించుకొని ప్రశ్నించిన గిరిజనులను అధికార దుర్వినియోగంతో పోలీసులతో కేసులు బనాయించడం, జైళ్లకు పంపించడం జరుగుతున్న క్రమంలో మీ నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండాలో ఆక్రమించుకున్న భూమిపై గిరిజనులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
  • తెలంగాణ రాష్ట్రంలో పేద గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాల కోసం సేకరిస్తూ వారికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించడం లేదనేది వాస్తవం. హరితహారం ప్రాజెక్టులో గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో మొక్కలు నాటే పేరుతో నిర్వాసితులను చేసి ప్రశ్నించిన వారిని పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, కేసులు పెట్టి జైళ్లో పెట్టడం… జరుగుతున్న విషయం వాస్తవం కాదా..? ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి.
  • నాగార్జునసాగర్ పక్కనే ఉన్న దేవరకొండ నియోజకవర్గంలోని, చందంపేట మండలంలో గిరిజన భూములను హరితహారం పేరు మీద గుంజుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పేరుతో గిరిజనుల అసైన్డ్ భూములను లాక్కొని వారిపై అక్రమ కేసులు బనాయించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ముందు గిరిజనులకు స్పష్టమైన హామీ ఇచ్చి నాగార్జున సాగర్ లో పర్యటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  • హుజూర్ నగర్ నియోజకవర్గంలో 6వేల ఎకరాల ప్రభుత్వ భూమికి నాగార్జునసాగర్ ముంపునకు గురైన రైతులకు భూములు కేటాయిస్తే, ఆ భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి, అక్రమ డాక్యుమెంట్లు తయారుచేసి, గిరిజనుల నుంచి గుంజుకున్న విషయం వాస్తవం కాదా..? తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని ధృవీకరిస్తూ ఈ భూమి గిరిజనులకు అసైన్డ్ భూమిగా గుర్తించి తీర్పునిచ్చినా .. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విషయం వాస్తవం కాదా..?
  • 6,200 ఎకరాల ఫారెస్ట్ భూములను ఇప్పటివరకు సర్వే చేయకుండా అడ్డుకున్న ప్రభుత్వ అధికారులపైన, రెవెన్యూ యంత్రాంగంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  • గుర్రంపోడు తండాలో 540 సర్వే నెంబర్ లో ప్రైవేటు వ్యక్తులు వేసుకున్న షెడ్డుకు పోలీసులను కాపలా పెట్టడం, ఆ షెడ్డును కాపాడుకునేందుకు పోలీసు రక్షణ కల్పించడం, అక్కడ నిరసన తెలియజేస్తున్న గిరిజనులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి కేసులు బనాయించడానికి కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  • గతంలో కూడా ఈ భూమిని అక్రమంగా బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేపట్టిన గిరిజనులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి, కర్కశంగా పోలీసులు కొట్టడాన్ని, అదేవిధంగా వారిపై అక్రమ కేసులు బనాయించి 40 రోజుల పాటు జైల్లో ఉంచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  • హుజూర్ నగర్ నియోజకవర్గంలో బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కబ్జా చేసిన భూములను వెంటనే గిరిజనులకు అప్పగించి, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, ఈ కబ్జాలకు పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా హుజూర్ నగర్ లో మొన్న మేం నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర సందర్భంగా పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.
  • హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న భూ దందాకు బాధ్యులపై టీఆర్ఎస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకొని, గిరిజనుల సమస్యలపై కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే వచ్చే నాగార్జునసాగర్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా బీజేపీ హెచ్చరిస్తోంది.
  • అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం. ఈ హక్కును తెలంగాణ రాష్ట్రంలో కాలరాస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర అనుమతి అవసరం లేకుండానే 10 శాతం జనాబా ఉన్న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సింది పోయి.. రాష్ట్ర శాసనసభలో తీర్మానం పేరుతో ఆరున్నరేళ్ల పాటు కాలయాపన చేసి, ఎంతో మంది పేద గిరిజన విద్యార్థులకు విద్య, ఉద్యోగావకాశాలను పోగొట్టినందుకు ముందు క్షమాపణ చెప్పి, వెంటనే 10 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
  • తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను బలవంతంగా నిరాశ్రయులను చేస్తూ.. వారి ఆకలిని తీర్చుకునేందుకు ఆధారమైన తిండి గింజలను పండించుకోకుండా అడ్డుపడుతూ ప్రశ్నించిన ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అంశంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల విధానాన్ని స్పష్టం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. గతంలో అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములపై తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తానని దాటవేస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా మేం గుర్తుచేస్తున్నాం” అన్నారు బండి సంజ్.