ప్రచారానికి వందల కోట్లు ఎవరి సొమ్ము

ప్రచారానికి వందల కోట్లు ఎవరి సొమ్ము
  • రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సొంత మీడియాకు, నచ్చినోళ్లకు పేజీల కొద్దీ యాడ్స్​
  • తమిళ్, కన్నడ, మరాఠీలో పబ్లిసిటీపై విస్మయం
  • కేసీఆర్ సర్కారుపై సోషల్​ మీడియాలో విమర్శలు
  • అప్పులు చేస్తూ యాడ్స్​ ఇవ్వడమేంటని మండిపాటు

మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె..అన్నట్లు రాష్ట్ర ఖజానాలో పైసల్లేకున్నా.. సర్కార్ మాత్రం పటాటోపం ప్రదర్శిస్తోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు పైసల్లేక జిల్లాకో రోజు చెల్లింపు ముహూర్తాలు పెడుతున్న ప్రభుత్వం.. సొంత పబ్లిసిటీకి మాత్రం కోట్లాది రూపాయలు కుమ్మరించింది. వందల కోట్ల ప్రజల సొమ్మును.. దేశమంతటికి దర్జాగా పప్పు బెల్లాలు పంచినట్టు  ఖర్చుపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న.. పత్రికలు, టీవీల అడ్వర్టయిజ్​మెంట్లకు భారీగా ఖర్చు చేసింది. జేబులో చిల్లిగవ్వ లేకున్నా పబ్లిసిటీకి ప్రభుత్వం పెట్టిన ఖర్చును చూసి జనం విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న టీఆర్​ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సొంత మీడియాతో పాటు రాష్ట్రంలో తమకు నచ్చిన పేపర్లకు పేజీల కొద్దీ యాడ్స్ ఇచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ తమ పబ్లిసిటీ అతిని ప్రదర్శించుకుంది. జాతీయ స్థాయి ఇంగ్లిష్ న్యూస్ పేపర్లతో పాటు తమిళ్, కన్నడ, మరాఠీ ప్రాంతీయ భాషా పేపర్లలోనూ ఫుల్ పేజీల ప్రకటనలు జారీ చేసింది.

మన ఉద్యమం,మన రాష్ట్రం,మన భాషకు సంబంధం లేని పేపర్లకు.. కోట్ల విలువైన యాడ్స్ ఇవ్వటంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ‘‘బంగారు తెలంగాణ అంటే విశ్వమంతా దూసుకుపోవాలి నాయకా.. అమెరికా, చైనా, బ్రిటన్, ఉక్రెయిన్ దేశాల్లోని పేపర్లలో యాడ్స్ ఇవ్వలేకపోయారా..మీ సొమ్మేం పోయింది” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కేసీఆర్ సర్కారును ఓ ఆట ఆడుకున్నారు. ఇక్కడి ఉద్యోగులకు జీతాల్లేవని డీఏలు కోత పెడుతూ పంజాబ్​లోని రైతుల కుటుంబాలకు పరిహారం చెక్కులు పంపిణీ చేయటంతో పాటు..  దేశ వ్యాప్తంగా వివిధ పేపర్లలో ప్రకటనలు ఇచ్చేందుకే వందల కోట్లు ఖర్చు పెట్టడంపై ఉద్యోగ వర్గాలు మండిపడ్డాయి. తమ జీతాలకు రూ.2 వేల కోట్లు సరిపోతాయని.. అవి ఇవ్వలేనప్పుడు రూ.400 కోట్లు పెట్టి పత్రికలు, టీవీలకు యాడ్స్ ఇవ్వటం.. ఎవరి ప్రయోజనం కోసమని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. 

కొంతకాలంగా నేషనల్ పొలిటిక్స్​లో ఎంట్రీకి ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్.. తన పొలిటికల్ మైలేజీ పెంచుకునేందుకే తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పేపర్లలోనూ యాడ్స్ ఇచ్చుకున్నారని.. ప్రజల సొమ్మును ఫలహారంలా పంచిపెడుతున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎనిమిదేండ్లుగా అప్పులు చేయటంతో రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ సంక్షోభంలో పడింది. సర్కార్ మితిమీరిన అప్పులు చేసినట్లు కాగ్ తప్పుబట్టడంతో 2 నెలలుగా ఆర్​బీఐ అప్పులు ఇవ్వట్లేదు. రోజువారీ నిర్వహణకూ డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడిందని ఫైనాన్స్ డిపార్టుమెంట్ తలపట్టుకుంటుంది. బిల్లుల చెల్లింపు నిలిపేసింది. గత నెలలో కొన్ని బ్యాంకుల నుంచి అనామతుగా వంద కోట్లు చేబదుళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత గడ్డు కాలంలో వందల కోట్లతో ఆర్భాటపు ప్రకటనలకు ఖర్చు పెట్టడం చూస్తే.. రాష్ట్రం ఇంకింత దివాళా తీస్తుందనే అనుమానాలకు తావిచ్చింది.