ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
  •  పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్​ఎమ్మెల్యేగా బీఆర్ఎస్​ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ​గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్​ సాయంతో స్పీకర్​ చాంబర్​కు వెళ్లారు. అసెంబ్లీ సిబ్బంది వీల్​ చైర్ ​సమకూర్చినా ఆయన వాకర్​సాయంతో నడుచుకుంటూనే వెళ్లారు. స్పీకర్ ​చాంబర్​లో స్పీకర్​గడ్డం ప్రసాద్ ​కుమార్​ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్​ను మండలి చైర్మన్ ​గుత్తా సుఖేందర్​రెడ్డి అభినందించారు. స్పీకర్​గడ్డం ప్రసాద్ ​కుమార్​కేసీఆర్​కు ఎమ్మెల్యే కిట్​బ్యాగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబు ఐడెంటిటీ కార్డు అందజేశారు.

కార్యక్రమంలో  ప్రభుత్వ విప్​అడ్లూరి లక్ష్మణ్​కుమార్, మాజీ స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆఫీసర్​లాంజ్​లో ​గల మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి కేసీఆర్​నివాళి అర్పించారు. బెంజ్​కారులో అసెంబ్లీకి వచ్చిన ఆయన తిరిగి అదే కారులో నందినగర్​లోని తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యేలు ట్రాప్​లో పడొద్దు

నందినగర్​లోని తన నివాసంలో కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరూ అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ​నేతల ట్రాప్​లో పడవద్దని, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. అయితే ఎమ్మెల్యేలు సీఎంను కలువాలనుకుంటే పార్టీకి ముందే సమాచారం ఇవ్వాలన్నారు. త్వరలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ ​సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలన్నారు. ఇకపై వారంలో రెండు రోజులు ప్రజలు, నాయకులను కలుస్తానని తెలిపారు.