మైనార్టీలకు రూ.లక్ష సాయం రెండు, మూడ్రోజుల్లో విధివిధానాలు: హరీశ్‌‌రావు

మైనార్టీలకు రూ.లక్ష సాయం రెండు, మూడ్రోజుల్లో విధివిధానాలు: హరీశ్‌‌రావు

 

  • మైనార్టీలకు రూ.లక్ష సాయం రెండు, మూడ్రోజుల్లో విధివిధానాలు: హరీశ్‌‌రావు
  • సీఎం కేసీఆర్‌‌‌‌ అనుమతి రాగానే అమల్లోకి పథకం 
  • ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే మైనార్టీలు  డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నరు

హైదరాబాద్, వెలుగు: మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష సాయం అందిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రెండు, మూడ్రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలోనే మైనార్టీలకు ఆయన శుభవార్త చెప్పబోతున్నారని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని జల విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మైనార్టీ నేతల సమావేశంలో మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మైనార్టీలను ఎంతో గౌరవిస్తారని, అందుకే రెండుసార్లు మహమూద్ అలీని మంత్రిని చేశారని చెప్పారు. మైనార్టీల కోసం షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మైనార్టీల సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.2,200 కోట్లు కేటాయించారని, తాము ఒక్క ఏడాదిలో పెట్టిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ పార్టీ పదేండ్లలో కూడా పెట్టలేదని మండిపడ్డారు. ఉర్దూతో పాటు ఇంగ్లిష్ మీడియంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మైనార్టీలు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని చెప్పారు. సల్వా ఫాతిమా పైలట్ అవుతానంటే సీఎం ఆమెకు డబ్బులిచ్చి ప్రోత్సహించారని, ఇప్పుడు ఆమె నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. 

మైనార్టీ యువతులు ఎక్కువగా చదువుతున్నది ఇక్కడే.. 

రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని హారీశ్‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. దేశంలో మైనార్టీ యువతులు ఎక్కువగా చదువుకుంటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. నీట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉర్దూలోనూ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఒక్కరే కోరారన్నారు. విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తూ, విదేశాల్లో చదివిస్తున్నామని తెలిపారు. రంజాన్​సందర్భంగా ముస్లిం కుటుంబాలకు గిఫ్టులు, ఇఫ్తార్ దావత్ ఇస్తున్నామన్నారు. అజ్మీర్ దర్గాలో తెలంగాణ భక్తుల కోసం రూ.5 కోట్లతో భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. దేశంలో ఇప్పటికీ ముస్లింలు ఇంకా పేదవారుగానే ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ చెప్పేదొకటి.. చేసేది ఒకటని.. వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ల చైర్మన్లు రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, ముజీబ్, సలీం తదితరులను ఘనంగా సత్కరించారు.

నిర్లక్ష్యం చేయొద్దు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కమిషనర్ అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి అన్ని జిల్లాల ప్రభుత్వ దవాఖాన్ల సూపరింటెండెంట్లతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ పూర్తి అలర్ట్​గా ఉండాలని సూచించారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్​లోని ప్రధాన ఆస్పత్రులదాకా వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో లోటు లేకుండా చూడాలన్నారు. అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా ఇబ్బందులుంటే ప్రజలు 040- 24651119 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. జిల్లా స్థాయిలోనూ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, అక్కడినుంచి ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వెహికల్స్​ను వినియోగించాలన్నారు.