19న బీఆర్‌‌‌‌ఎస్ కార్యవర్గ సమావేశం

19న బీఆర్‌‌‌‌ఎస్  కార్యవర్గ సమావేశం
  • కులగణన, స్థానిక ఎన్నికలపై కేసీఆర్‌‌‌‌ అధ్యక్షతన చర్చ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 19న కేసీఆర్‌‌‌‌ అధ్యక్షతన బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌‌లో నిర్వహించనున్న ఈ మీటింగ్‌‌కు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌‌చార్జ్​లతో సమావేశం నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ కార్యకర్తలు చేప ట్టాల్సిన కార్యాచరణ, కులగణన సర్వేతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తామన్నారు. హక్కులను కాపాడుకునేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ  వ్యూహాలపై డిస్కస్ చేస్తామని తెలిపారు.