కొత్త పంచాయతీ రాజ్ చట్టం, నిధుల వాడకంపై కొత్తగా ఎన్నికైన సర్పంచులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. సర్పంచులనుద్దేశించి మాట్లాడనున్నారు. నిన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లో పాలన తీరుపై కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఇవాళ శిక్షణ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో మొదలయ్యే కార్యక్రమాన్ని గులాబీ బాస్ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో పాటు… ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొంటారు. ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచులు తాజా మాజీ సర్పంచులు హాజరవుతారు.
నిన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని….గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు.
నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12వేల 751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలన్నారు.
మరోవైపు అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలని ఆదేశించారు. మూడు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో ఒకటి, మూడు వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో రెండు వైకుంఠధామాలు నిర్మించాలన్నారు.
