కేసీఆర్ ఎత్తులు హుజూరాబాద్ లో చెల్లవు

కేసీఆర్ ఎత్తులు హుజూరాబాద్ లో చెల్లవు
  • జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామం వద్ద పాదయాత్రలో  మాజీ మంత్రి ఈటల

కరీంనగర్: సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు.. కుయుక్తులు పన్నినా.. ఆయన ఎత్తులు ఏవీ హుజూరాబాద్ లో చెల్లవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో పాదయాత్ర సందర్భంగా ఈటల రాజేందర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఓడిపోతామని తెలుసుకుని నాకు మద్దతు తెలుపుతున్న వారందరినీ భయ పెడుతున్నారని ఈటల విమర్శించారు. రుణమాఫీ చేస్తారా ? చెయ్యరా? తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. కాళ్లు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వస్తున్న మంత్రులు ఎమ్మెల్యేల్లారా అసలు మీరు ఎవరు? ఇక్కడి వారితో మీకేం సంబంధం? తోడేళ్ల మాదిరి మీద పడుతున్నారని ప్రశ్నించారు. నేను చెడు చేయనంత వరకు నా ప్రజల హృదయాల్లో నా ఫోటో ఉంటుందనే విషయం నాకు తెలుసు అని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. 
కేసీఆర్ వేల కోట్లు హుజూరాబాద్ లో ఖర్చు పెడుతున్నారు
కేసీఆర్ వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని, వాటిని ఇక్కడ ఖర్చు పెడుతున్నారని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. నా వల్ల ఇక్కడి వారికి లాభం అవుతుందంటే నాకు సంతోషమే, కానీ ఒక్క హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర మంతా ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. కుట్రతో ఎన్నికల కోసం ఆలోచన చేయవద్దు అని హెచ్చరించారు. కేసీఆర్ నీ ఆటలు ఇక్కడ చెల్లవు అని, కేసీఆర్ ఎత్తులను తొక్కి పడేసి తనను గెలిపించాలని, నిండు మనసుతో ఆశీర్వదించాలని మాజీ మంత్రి ఈటల కోరారు.