తొమ్మిదిన్నరేండ్ల తర్వాత సొంతింటికి కేసీఆర్

తొమ్మిదిన్నరేండ్ల తర్వాత సొంతింటికి కేసీఆర్
  • సొంతింటికి కేసీఆర్ .. 
  • యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
  • తొమ్మిదిన్నరేండ్ల తర్వాత నందినగర్​లోని నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్​ చీఫ్
  • దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు : యశోద హాస్పిటల్​నుంచి బీఆర్ఎస్​ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ డిశ్చార్జ్​ అయ్యారు. హాస్పిటల్​నుంచి కుటుంబ సభ్యులు ఆయనను నందినగర్​లోని నివాసానికి తీసుకెళ్లారు. హాస్పిటల్​నుంచి వీల్​చైర్​లో బయటకు వచ్చిన కేసీఆర్ వాకర్, కుటుంబ సభ్యుల​సాయంతో కారులోకి ఎక్కారు. బంజారాహిల్స్​లోని నంది నగర్​నివాసానికి చేరుకున్న ఆయన కారు నుంచి దిగి వీల్​చైర్​లో ప్రధాన ద్వారం వరకు వచ్చారు. దిష్టితీసి గుమ్మడి కాయ కొట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. వాకర్​సాయంతో ఆయన ఇంట్లోకి వెళ్లారు. 

ఈనెల 7న అర్ధరాత్రి ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్​లో కేసీఆర్​జారి పడటంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. 8న సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్​డాక్టర్లు ఆయనకు ఆపరేషన్​చేశారు. ఎనిమిది రోజుల పాటు యశోద హాస్పిటల్​లో చికిత్స పొందిన ఆయన శుక్రవారం డిశ్చార్జ్​ అయ్యారు. ఆయనకు డైలీ మెడికల్​ఫాలో అప్, ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

2014 జూన్​2న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్​ నందినగర్​ నివాసం నుంచి బేగంపేట క్యాంపు ఆఫీస్​కు షిఫ్ట్​అయ్యారు. 2016 నవంబర్​లో ప్రగతి భవన్​ నిర్మాణం పూర్తయ్యాక అందులోకి నివాసం మార్చారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రకటించగా బీఆర్ఎస్ ​ఓడిపోవడంతో కేసీఆర్ అదే రోజు ప్రగతి భవన్ ​ఖాళీ చేసి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్​కు వెళ్లిపోయారు. 

ఇప్పుడు హిప్​రీ ప్లేస్​మెంట్​సర్జరీ చేయించుకొని విశ్రాంతి కోసం నందినగర్​లోని తన నివాసానికి చేరుకున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత కేసీఆర్​ తన సొంత ఇంటికి తిరిగివచ్చారు. కాగా, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్​లో ఆకాంక్షించారు.