రూల్స్ అన్నీ మార్చి హెటిరోకి భూములు కట్టబెట్టిన కేసీఆర్

రూల్స్ అన్నీ మార్చి హెటిరోకి భూములు కట్టబెట్టిన కేసీఆర్

హెటిరో పార్థసారథిరెడ్డి ట్రస్టుకు గత బీఆర్​ఎస్​ సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని సీఎం రేవంత్​ సూత్రప్రాయంగా నిర్ణయించారు. హెటిరో కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్ లో  సాయిసింధు ఫౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పారు.  తాము చేపట్టే క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్​నగర్​లో 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీఎంకు అప్లై చేసుకున్నారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ఈ ట్రస్ట్ ఏకంగా వందల కోట్ల విలువైన భూమి అడిగితే పక్కన పెట్టాల్సిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. లీజు నిబంధనలన్నీ ఆ ట్రస్ట్​కు అనుకూలంగా మార్చి భూసంతర్పణ చేసింది. 

అయితే..ఇజ్జత్​నగర్​లో ట్రస్ట్​ అడిగిన స్థలాన్ని అప్పటికే టీఎస్ఐఐసీ వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో ఇజ్జత్​నగర్ బదులు ఖానామెట్​లో ప్లేస్ ఇవ్వాలని ఫైళ్లు మార్చారు. ఖానామెట్​లో సర్వే నెంబర్ 41/14/2లో 15 ఎకరాల స్థలం కేటాయించాలని సీసీఎల్ఏకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టాప్ ప్రియారిటీ ఆదేశాలిచ్చారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఖానామెట్​లో ఒక్కో ఎకరం రూ.33.70 కోట్లు. మొత్తం 15  ఎకరాలకు రూ.505.50 కోట్లు అవుతాయని, దీన్ని వేలం వేయాలనుకున్నట్లు అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్, అప్పటి కలెక్టర్ నోట్ సమర్పించారు. వేలం వద్దని.. సాయిసింధు ఫౌండేషన్ ట్రస్ట్ కు  ఇవ్వాలంటూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆదేశించింది. 

హైటెక్ సిటీకి 500 మీటర్ల దూరంలో హెచ్ఐసీసీకి వెళ్లే మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నందున, ఆ స్థలం అత్యంత విలువైందని రాజేంద్రనగర్ ఆర్డీవో కూడా అదే రేటును ధ్రువీకరించారు. జీవో నెం.571 ప్రకారం ఆ భూమిని సాయిసింధు ఫౌండేషన్ కు లీజుపై కేటాయించాలని అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కు మెమో జారీ చేసింది. జీవో నెం.571 ప్రకారం.. భూమి విలువలో పది శాతం లీజు రెంట్ గా చెల్లించాలి. అంటే రూ.505 కోట్ల విలువ ఉన్న భూమికి ఏడాదికి రూ.50 కోట్లు చెల్లించాలి. ఐదేండ్లకోసారి 10% చొప్పున పెంచుతూ పోవాలి. అంటే 60 ఏండ్ల లీజు కోసం.. ప్రభుత్వానికి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించాలి. సాయిసింధు ఫౌండేషన్ కు 3 ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు అర్హత ఉందని అప్పటి కలెక్టర్ సీసీఎల్ఏ స్పెషల్  సెక్రటరీకి  లెటర్ రాశారు. మూడు కాదు..  11 ఎకరాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికే 15 ఎకరాల్లో ఆ ఫౌండేషన్ నిర్మాణాలు మొదలుపెట్టింది.