మధ్య నిషేధం వైపు పంచాయతీలు.. పంచాయతీ పాలక వర్గాల తీర్మానాలు

 మధ్య నిషేధం వైపు పంచాయతీలు.. పంచాయతీ పాలక వర్గాల తీర్మానాలు

మెదక్, సిద్దిపేట, వెలుగు: మెదక్, సిద్దిపేట జిల్లాలో ఇటీవల ఎన్నికైన పలు కొత్త పంచాయతీ పాలక వర్గాలు సంపూర్ణ మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన బెల్ట్ షాప్ ల వల్ల  గ్రామాల్లో వాతావరణం  పూర్తిగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు, కిరాణా షాప్ లు, కూల్ డ్రింక్ షాప్ లలో మద్యం దొరుకుతుండడంతో అనేక మంది మద్యానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువకులు మందుకు బానిసలుగా మారుతున్నారు. చాలా మంది పొద్దంతా కష్టం చేసి వచ్చిన డబ్బులను తాగుడుకు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా చితికి పోవడంతో పాటు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.

విపరీతంగా మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం అనేక కుటుంబాల్లో గొడవలకు కారణమవుతోంది. కొందరు తాగిన మైకంలో ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరి కొందరు భార్యలను, పిల్లలను, తల్లి దండ్రులను హత్య చేస్తున్నారు. బెల్ట్ షాపుల కారణంగా అవాంఛనీయ ఘటనలు జరుగుతుండడంతో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాలు మధ్య నిషేధానికి తీర్మానాలు చేస్తున్నారు. 

ఎక్కడెక్కడంటే..

మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్, డి. ధర్మారం, వెంకటాపూర్, మండల కేంద్రమైన కొల్చారం, సిద్దిపేట జిల్లా అక్బర్ పేట -భూంపల్లి మండలం బొప్పా పూర్ పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా మధ్య నిషేధ తీర్మానాలు చేశాయి. గ్రామాల్లో అన్ని బెల్ట్ షాప్ లు మూసి వేయాలని నిర్ణయించారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మితే జరిమానాలు విధించాలని తీర్మానించారు. 

సిద్దిపేట జిల్లా బొప్పా పూర్ లో బెల్ట్ షాప్ నిర్వహిస్తే లక్ష రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించగా,  మెదక్ జిల్లా రామాయంపేట మండలం  డి.ధర్మారంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.10 వేల నజరాన ఇవ్వాలని తీర్మానించారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా గ్రామాల్లో మధ్య నిషేధ ర్యాలీలు తీశారు. ప్రజలతో ప్రతిజ్ఞలు చేయించారు. కొన్ని చోట్ల 18 ఏళ్ల లోపు పిల్లలకు, గుట్కా, సిగరెట్లు అమ్మొద్దని తీర్మానించారు. మరికొన్ని గ్రామాలు మధ్య నిషేధం అమలు దిశగా ఆలోచన చేస్తున్నాయి. 

లక్ష జరిమానా విధిస్తాం 

గ్రామంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని మధ్య నిషేధం విధించారు. బెల్ట్ షాప్ లను పూర్తిగా మూసి వేయాలని నిర్ణయించాం. ఎవరైనా ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తాం. గ్రామ ప్రజల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. - భాను ప్రసాద్, సర్పంచ్, బొప్పా పూర్