మీకు నాపై కోపముంటే విషమిచ్చి చంపండి..చేతులెత్తి మొక్కుతున్నా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మీకు నాపై కోపముంటే విషమిచ్చి చంపండి..చేతులెత్తి మొక్కుతున్నా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • చేతులెత్తి మొక్కుతున్నా.. మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి: మంత్రి వెంకట్​రెడ్డి 
  • తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి
  •     నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామనుకున్న
  •     ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది 
  •     సీఎం, మంత్రులు, మహిళా ఆఫీసర్లపై దుష్ప్రచారం చేస్తున్నరు
  •     టీఆర్పీ రేటింగ్స్, వ్యూస్ కోసం ఫేక్ న్యూస్‌‌ ఇస్తున్నరు 
  •     సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి 
  • నాకేమీ తెలియదు    పుష్ప2 ఎపిసోడ్​ తర్వాత 
  • సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేశా
  •     ఫేక్‌‌ న్యూస్‌‌పై డీజీపీకి ఫిర్యాదు చేశానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మీడియాలో తనపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి. మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి” అని మీడియా ముందు ఆయన కంటతడి పెట్టుకున్నారు. ‘‘మహిళా ఐఏఎస్​ ఆఫీసర్లు అని కూడా చూడకుండా ఇష్టమున్నట్టు వార్తలు రాస్తున్నారు. సీఎం రేవంత్, మంత్రులను, మహిళా ఆఫీసర్లను బయటికి లాగి దుష్ప్రచారం చేస్తున్నారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాను” అని వాపోయారు. తనపై వస్తున్న ఫేక్‌‌‌‌ న్యూస్‌‌‌‌పై డీజీపీకి ఫిర్యాదు చేశానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌లో మీడియాతో వెంకట్​రెడ్డి మాట్లాడారు. గత మూడ్రోజులుగా తనకు, మహిళా ఐఏఎస్​ఆఫీసర్‌‌‌‌కు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. 

మానసికంగా హింసిస్తున్నరు.. 

ఇన్నేండ్లు నిప్పులాగా బతికిన తనను మానసికంగా హింసిస్తున్నారని వెంకట్‌‌ రెడ్డి ఆవేదన చెందారు. 2011లో తన కొడుకు చనిపోయినప్పుడే తీవ్రంగా కుంగిపోయానని, అప్పుడే రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని వాపోయారు. ‘‘ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, రెండుసార్లు మంత్రిగా పని చేస్తూ ప్రజా సేవలో నిమగ్నమైన నాపైనే ఇలాంటి దుష్ప్రచారం చేయడం నన్ను ఎంతగానో బాధించింది. టీఆర్పీ రేటింగ్‌‌ల కోసం, యూట్యూబ్​వ్యూస్, లైక్స్ కోసం పోటీ పడి ఫేక్​వార్తలు ఇవ్వడం సరికాదు. రెస్ట్ లేకుండా పని చేస్తున్న సీఎం రేవంత్‌‌, మరో మంత్రిపైన కూడా ఇలా తప్పుడు ఆరోపణలతో వార్తలు రాస్తున్నారు. మహిళా ఐఏఎస్​ ఆఫీసర్లు అని కూడా చూడకుండా తప్పుడు సంబంధాలు అంటగడుతూ ఫేక్​న్యూస్ సర్క్యులేట్​చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసే వాళ్లకు అక్కాచెల్లెళ్లు లేరా? రాసే ముందు ఒక్కసారి ఆలోచించరా? మహిళా ఆఫీసర్లు ఉద్యోగాలు చేయడమే తప్పా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన నన్ను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు. నాపై కోపం ఉంటే ఇంత విషమిచ్చి చంపండి. నేను కష్టపడి పైకి వచ్చాను. దేవుడిపై నాకు నమ్మకం ఉంది. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి” అని మీడియాను వేడుకున్నారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు ఎంతగా చేసినా మేం తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మావల్ల కాదు” అని వాపోయారు. 

ఐఏఎస్‌‌ల బదిలీలు మా చేతుల్లో ఉండవ్.. 

జిల్లా కలెక్టర్ల నియామకం, బదిలీలు మంత్రుల చేతుల్లో ఉండవని వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. ఐఏఎస్‌‌ల బదిలీలు సీఎం, సీఎస్ నిర్ణయం ప్రకారం జరుగుతాయని తెలిపారు. ‘‘ఇటీవల నాపై, మహిళా ఐఏఎస్‌‌పై, సీఎం రేవంత్, మరో మంత్రిపై వచ్చిన తప్పుడు కథనాల మీద సమగ్ర విచారణ చేయాలని డీజీపీ శివధర్​రెడ్డిని కోరాను. డీజీపీతో గంటసేపు మాట్లాడాను. ఆయన త్వరలోనే ఎంక్వైరీ పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్‌‌తో పాటు మంత్రులపై మీడియలో ఫేక్ న్యూస్‌‌ సర్క్యులేట్ చేస్తున్నారు” అని అన్నారు. 

సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదు.. 

కొత్త సినిమాల టికెట్​ధరల పెంపు, బెన్‌‌ఫిట్​షోల గురించి తనకేమీ తెలియదని వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘పుష్ప–2 సినిమా సమయంలో ఓ మహిళ చనిపోయిన తర్వాత టికెట్​రేట్ల పెంపు, బెన్‌‌ఫిట్​షోల గురించి నా దగ్గరికి ఎవరూ రావద్దని చెప్పాను. అప్పటి నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన వారెవరూ నన్ను కలవడం లేదు. పుష్ప–2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా.. టికెట్​రేట్ల పెంపు, బెన్‌‌ఫిట్​షోల విషయంలో నా ప్రమేయం ఉన్నట్టుగా తప్పుడు వార్తలు రాయొద్దు” అని మీడియాను వేడుకున్నారు. 

ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్​నుంచి సొంతూర్లకు వెళ్లే వాళ్లకు ట్రాఫిక్​ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వెంకట్​రెడ్డి తెలిపారు. ‘‘హైదరాబాద్–విజయవాడ హైవేలో పోయిన సంక్రాంతికి 9 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈసారి 12 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే టోల్‌‌గేట్ ఫ్రీగా వదిలేయాలని ఆదేశాలు ఇచ్చాం. పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని చెప్పాం. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశాం. 1033 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచాం” అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు 
ఎన్ని చేసినా మేం తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మావల్ల కాదు.

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి