కాంగ్రెస్ గెలిస్తే..? : మారిన సీఎం కేసీఆర్ స్వరం

కాంగ్రెస్ గెలిస్తే..? : మారిన సీఎం కేసీఆర్ స్వరం
  • కాంగ్రెస్ గెలిస్తే..?
  • మారిన సీఎం కేసీఆర్ స్వరం
  • పదేండ్లలో చేసిన ప్రగతి మరిచి కొత్త పాట
  • మూడు అంశాలను ప్రస్తావించి ప్రసంగం క్లోజ్
  • కరెంటు, ధరణి, రైతుబంధు పథకాల ప్రస్తావన
  • ఓడిపోతే రెస్ట్ తీసుకుంటం అంటూ నిర్లిప్తత
  • సభల్లోనే శాపనార్థాలు పెడుతున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరం మారుతోంది. మొన్నటి దాక అద్భుతమైన అభివృద్ది చేశామని, బంగారు తెలంగాణ, పసిడి పంటల రాష్రం అంటూ ప్రసంగించిన సీఎం ఇప్పుడు స్వరం మార్చారు. భవిష్యవాణి చెప్పడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ గెలిస్తే కారుచీకట్లు కమ్ముకుంటాయంటున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చామని, కాళేశ్వరంతో దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా తెలంగాణను మార్చామని చెప్పిన కేసీఆర్ కు ఇప్పుడు కాంగ్రెస్ భయం పట్టుకుందా..? ఎందుకు ఆయన పదే పదే కాంగ్రెస్ గెలిస్తే.. ధరణి ఎత్తేస్తరని, రైతుబంధు రాదని, కారు చీకట్లు కమ్ముకుంటాయని చెప్తున్నారు. 

రోజుకు మూడు నాలుగు బహిరంగ సభలకు వెళ్తున్న కేసీఆర్.. స్వరం ఎందుకు మారిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండటంతో ఆయన డిఫెన్స్ లో పడ్డారా? అన్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ పనైపోయిందని, వృద్ద జంబూకం అని, వంద జాకీలు పెట్టినా లేవదంటూ కామెంట్ చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడా పార్టీకి ఎందుకు భయపడుతున్నారు. పదే పదే కాంగ్రెస్ గెలిస్తే.. కాంగ్రెస్ గెలిస్తే అని ఎందుకు ప్రస్తావిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని సభల్లో తన మ్యానిఫెస్టోను కూడా ప్రస్తావించకుండనే ప్రసంగం ముగిస్తుండటం గమనార్హం. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గెలిస్తే కైలాసంల పెద్దపాము మింగినట్టయితది.. బాగా ఆలోచించి ఓటు వేయాలని చెబుతూనే.. ఓడిపోతే ఇంట్ల కూసుంటం అదో రకమైన బెదిరింపు ధోరణికీ దిగుతున్నారు. 

మూడు గంటలే కరెంటు ఇస్తరని, అప్పుడు 10 హెచ్ పీ మోటార్లు కొనుక్కోవాని.. ఓటు ఎవరికి వేయాల్నో మీరే ఆలోచించుకోవాలని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అప్పుడు శాసనసభలోనే ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు స్వరం మార్చారు. వేలాది మంది బిడ్డల ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఉసురు తగులుతదని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. 

పెద్దపాము మింగినట్లయితది

కాంగ్రెస్ గెలిస్తే కైలాసంల పెద్ద పాము మింగినట్లయితది.. ధరణి బందైతది, రైతుబంధు, రైతు బీమా రాదు.. ధరణి బందైతే పటేల్, పట్వారీలు వస్తరు.. చాలీస్ హజార్ లావో అంటరు. ధాన్యం అమ్మిన పైసలు కింది మీదైతయ్.. మీ ఖాతాల్లో పడయ్..

పాలిచ్చే బర్రెను అమ్మి.. దున్నపోతును తెచ్చకుందామా?

కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా తేల్చుకోవాలె.. కాంగ్రెస్ గెలిస్తే.. 24 గంటల కరెంటు పోతది.. మూడు గంటల కరెంటు వస్తది. అప్పుడు 10 హెచ్పీ మోటార్లు కావాలె.. ఎవరు కొంటరు.. పైసలు ఎక్కడి నుంచి వస్తయి.. తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం.. దర్జాగా బతుకుతున్న మనం దగా పడ్తం పాలిచ్చే బెర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకుందామా..? 

ఓడిపోతే రెస్ట్ తీసుకుంటం

వ్యక్తిగతంగా మాకు పోయేదేం లేదు.. సపోజ్ మీరు ఓడగొట్టిండ్రనుకో.. ఏమున్నది రెస్ట్ తీసుకుంటం.. మాకు వచ్చేదేం లేదు.. పోయేదేం లేదు.. కానీ నష్టపోయేది ప్రజలే.. చెప్పుడు మా బాధ్యత.