కేసీఆర్.. టీచర్లంటే కక్ష ఎందుకు?

కేసీఆర్.. టీచర్లంటే కక్ష ఎందుకు?

సీఎం కేసీఆర్ ఎందుకో టీచర్ల మాటంటేనే ఇబ్బందిగా ఫీలవుతున్నట్టున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎలక్షన్ డ్యూటీకి టీచర్లను దూరంగా పెట్టారు. దేశంలో ఏ సీఎం తీసుకోని విధంగా గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీచర్లు ఎన్నికలను ప్రభావితం చేస్తారన్న పొరబాటు ఆలోచనతో తన చెప్పుచేతల్లో ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌కు చెప్పి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్లను పక్కన పెట్టడం వింతగా ఉంది. కానీ ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలు, పోలింగ్ ఏజెంట్లు ఉండగా.. ఓటర్లను ప్రభావితం చేయడం అసాధ్యం. అయినా ఈ ఆలోచన చేయడంలో ఆయన ఉద్దేశం ఏదైనా సరే, గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఒక్కటే.. కేసీఆర్ సర్కారుపై ఒక్క టీచర్లే కాదు అన్ని డిపార్టుమెంట్లలోని ఉద్యోగులూ కోపంగానే ఉన్నారు.

ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనదనే విషయం కేసీఆర్​కు బాగా తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తన అభిమాన గురువు మృత్యంజయ శర్మను వేదికపై సన్మానించడం ఎవరూ మర్చిపోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవ వేడుకలకు సీఎం హాజరయ్యేవారు. 2014లో గురుపూజోత్సవ వేడుకలకు వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మొహం చూపించలేదు.

టీచర్లతో ఆడుకోవద్దు

ఉపాధ్యాయులను వేధించడం ద్వారా ఏ ప్రభుత్వాలూ సాధించిందేమీ లేదు. ఎన్టీఆర్ సీఎంగా ఉండగా 1988లో టీచర్లు తమ సొంత గ్రామాల్లో పని చేస్తే రాజకీయాలను ప్రభావితం చేస్తారంటూ ఏకంగా సొంత రెవెన్యూ డివిజన్ లోనే ఉండకూడదని జీవో తెచ్చి.. ట్రాన్స్​ఫర్లు చేయించారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించి ఆ జీవోను రద్దు చేయించుకోగలిగాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ ఓడిపోయారు. ఇక 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా ఉద్యోగులు, టీచర్లను వేధింపులకు గురి చేసి.. 2004 ఎలక్షన్స్ లో ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలు కేసీఆర్ కు గుర్తున్నాయనే అనుకుంటున్నాం.

ఆరున్నరేండ్లలో చేసిందేం లేదు

ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించుకున్న కేసీఆర్ ఆరున్నరేండ్లలో ఉద్యోగులకు, టీచర్లకు చేసిందేమీ లేదు. ప్రతి ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏ ఎప్పుడూ టైమ్ కి ఇవ్వలేదు. మూడు నెలల్లోనే కొత్త పీఆర్సీ ప్రకటిస్తామని 2018 మే నెలలో ఇచ్చిన హామీకి ఇప్పటికీ దిక్కు లేదు. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు. దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతోంది. టీచర్ల ప్రమోషన్లు, కొత్త పోస్టుల భర్తీ మాటే లేదు. సీపీఎస్ రద్దుపై కమిటీ అన్నారు.. కానీ నేటికీ దానిని పట్టించుకోలేదు. హెల్త్ కార్డులు ఇచ్చి.. వాటిపై టీట్మెంట్ అందకపోయినా పట్టించుకోకపోతిరి. మిగులు బడ్జెట్ రాష్ట్రమని చెప్పి.. కరోనా రాగానే జీతాల చెల్లింపులో కోత పెట్టి.. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లను ఇబ్బందిపెట్టారు. 2014కు పూర్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో నాలుగు ఉపాధ్యాయ సంఘాలకు, రెండు ఉద్యోగ సంఘాలకు సభ్యత్వం ఉండేది. ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఓడీ (అదర్ డ్యూటీ) సౌకర్యం ఇచ్చేవారు. కానీ తెలంగాణలో తొలి ఐదేళ్లు ఏ సంఘాలకు సభ్యత్వం ఇవ్వాలన్న దానిపై కమిటీ వేస్తామని చెప్పి.. మర్చిపోయారు. ఆ ఐదేళ్లు మూడు టీచర్ యూనియన్లు, రెండు ఉద్యోగ సంఘాలకు ఓడీ ఇచ్చారు. కానీ గతేడాది నుంచి  ఉపాధ్యాయ సంఘాలకు పూర్తిగా ఓడీ నిలిపేయడం టీచర్లపై కక్ష సాధింపు కాదా? కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ మర్చిపోయారు. ఉద్యోగాల భర్తీ గాలికొదిలేశారు. పైగా ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా, పోరాడినా అణచివేత ధోరణి అవలంభిస్తూ అభద్రతా భావాన్ని బయటపెట్టుకుంటున్నారు.

ఓడితే మాకు.. గెలిస్తే మీకు క్రెడిటా?

కేసీఆర్ సీఎం అయ్యాక జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో హైదరాబా ద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని టీచర్ల మీద నెట్టేసి.. వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థి గెలుపును మాత్రం మీ ఖాతాలో వేసుకోవడం అన్యాయం. గెలిచిన అభ్యర్థి టీచర్లు ఇచ్చిన మద్దతు విషయాన్ని మర్చిపోతే ఎలా? 2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డ్యూటీలు చేసిన టీచర్లు, ఇతర ఉద్యోగులు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో 2019లో జరిగిన ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చేందుకు ఆయన ధైర్యం చేయలేదు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్చిన ముగ్గురు అభ్యర్థులూ ఓడిపో యారు. మొన్నటి దుబ్బాక ఎలక్షన్స్ లోనూ టీచర్లు వ్యతిరేకంగా పని చేయడం వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని కేసీఆర్ నమ్ముతున్నారు.

వ్యతిరేకంగా ఓటేసే చాన్స్ ఇచ్చారు

ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్లకు డ్యూటీలు వేయకుండా దూరం పెట్టారు. ఇలాగే భవిష్యత్తులో కూడా చేయగలరా?  ఇకపై రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనూ తమకు డ్యూటీలు వేయొద్దని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీని ప్రకారం తర్వాత జరగబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో కూడా డ్యూటీలు వేయకుండా ఆపగలరా?. అది మీతో సాధ్యం కాదని తెలుసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుంది. పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండదు. ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం చూస్తుందని, ఆ సమయాల్లో టీచర్లకే డ్యూటీలు వేస్తుందని గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి మీరనుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఎవరున్నా ఓటర్లను ప్రభావితం చేయలేరు. కానీ ఇప్పుడు మీరు టీచర్లను డ్యూటీలకు దూరంగా పెట్టడం ద్వారా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలుగుతారు. టీచర్లను ఇంట్లో ఉంచడం ద్వారా పోలింగ్ బూత్ కు వచ్చి మీకు వ్యతిరేకంగా ఓటేసే చాన్స్ ఇచ్చారు. తమ కుటుంబాలతోనూ మీకు వ్యతిరేకంగా ఓటేయిస్తారు. అంతేకాదు ఎవరికి ఓటేస్తే మంచిదన్నది చెప్పడం ద్వారా తోటివారిని ఎడ్యుకేట్ చేసి.. పోలింగ్ బూత్ కు వచ్చేలా చేస్తారు. భావి పౌరులను తీర్చిదిద్దడం ద్వారా జాతి నిర్మాణం చేసే ఉపాధ్యాయులు సమాజానికి మంచి, చెడులను చెప్పే బాధ్యతను మరచిపోరని గుర్తుంచుకోండి. మీకు రాష్ట్రాన్ని పాలించేందుకు ఇంకా మూడున్నరేళ్ల టైమ్ ఉంది. ఇప్పటికైనా మీరు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. లేదంటే మొన్న దుబ్బాకలో మాదిరిగానే రేపు గ్రేటర్ హైదరాబాద్, ఆ తర్వాత జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. -పులి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కో-చైర్మన్, బీజేపీ రిటైర్డు టీచర్స్ & ఎంప్లాయిస్.