
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను పక్కనే ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గాయపడిన కూలీలు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా సమాచారం. ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాను అనురాగ్ వర్శిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ALSO READ : కామారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. దాబా దగ్గర ఆగిన ట్రక్కులో రూ. 10 లక్షల సెల్ ఫోన్లు లూటీ..
బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదే అనురాగ్ యూనివర్శిటీ. అనురాగ్ యూనివర్శిటీ ఇప్పటికీ చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో అనురాగ్ వర్శిటీ నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో పలువురు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే తాజా మరో వివాదంలో చిక్కుకుంది అనురాగ్ వర్శిటీ.