అక్టోబర్ 25 నుంచి మళ్లీ కేసీఆర్ సభలు

అక్టోబర్ 25 నుంచి మళ్లీ  కేసీఆర్ సభలు
  • బుధ, గురువారాల షెడ్యూల్​లో స్వల్ప మార్పులు
  • ఈ నెల 27 నుంచి నవంబర్ 9 వరకు పాత షెడ్యూల్ ప్రకారమే సభలు 
  • నవంబర్ 9న రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్ 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ బుధవారం నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ప్రచార వేగం పెంచనున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్.. అదేరోజు సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత మూడ్రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. దసరా నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 24 వరకు ప్రచారానికి గ్యాప్ ఇచ్చిన కేసీఆర్.. మధ్యలో తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలతో భేటీ అయ్యారు. 

ఇప్పుడు మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు నియోజకవర్గాల సభల్లో కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా.. ఇందులో నాగర్ కర్నూల్ కు బదులుగా వనపర్తి సభలో పాల్గొంటారు. గురువారం పాలేరు, స్టేషన్ ఘన్ పూర్ సభల్లో పాల్గొనాల్సి ఉండగా.. స్టేషన్ ఘన్ పూర్ కు బదులుగా మహబూబాబాద్, వర్ధన్నపేట సభల్లో పాల్గొంటారు. శుక్రవారం నుంచి నవంబర్ 9 వరకు ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 

కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేస్తారు. అదే రోజు కామారెడ్డిలో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. నవంబర్ 12న దీపావళి నేపథ్యంలో ప్రచారానికి స్వల్ప విరామం ఇచ్చి 13 లేదా 14వ తేదీన మళ్లీ ప్రచారం షురూ చేస్తారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే 28న గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల పక్షాన నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా కేసీఆర్ వంద సభల్లో పాల్గొంటారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. 

కేటీఆర్, హరీశ్ స్పెషల్ ఫోకస్.. 

కేసీఆర్ తో పాటే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చేలా ప్రచార షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల, కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఓల్డ్ సిటీ మినహా గ్రేటర్ లోని 22 నియోజకవర్గాలను కవర్ చేసేలా ఆయన రోడ్డు షోలకు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ఆయా పార్టీల్లోని బలమైన నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతూనే, మరోవైపు ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. 

ఇప్పటి వరకు 109 మందికి బీఫామ్స్.. 

116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటికే 109 మందికి బీ ఫామ్ లు అందజేశారు. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలకు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అలంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ప్రకటించినప్పటికీ, స్థానిక నేతల అభ్యంతరాలతో బీఫామ్ పెండింగ్ లో పెట్టారు. నర్సాపూర్, అలంపూర్, గోషామహల్ తో పాటు ఏడు ఎంఐఎం సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ లు ఇవ్వాల్సి ఉంది. ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై ఒకట్రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటారని ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రచారం పై దృష్టి సారిస్తున్నారు.