రేపు కొడకండ్లకు కేసీఆర్​

రేపు కొడకండ్లకు కేసీఆర్​
  •     రైతు వేదికను ప్రారంభించనున్న సీఎం
  •    దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

జనగామ, వెలుగు: 31న సీఎం కేసీఆర్‌‌ జనగామ జిల్లాలోని  కొడకండ్ల మండల కేంద్రానికి రానున్న నేపథ్యంలో  పర్యటన ఏర్పాట్లను గురువారం  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..   31 న మంచి ముహూర్తం ఉన్నందున రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో  సీఎం కేసీఆర్  కొడకండ్లలో  రైతు వేదికను ప్రారంభించనున్నారని చెప్పారు.  మొదట పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారని,  తర్వాత రైతు వేదికను ఓపెనింగ్​ చేసి స్థానిక వ్యవసాయ  మార్కెట్ ఆవరణలో  ఏర్పాటు చేసే  సభలో 5వేల మంది రైతులతో మాట్లాడతారని తెలిపారు.  రైతు వేదికల ముఖ్య ఉద్దేశ్యాలను  రైతులకు వివరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో  రూ. 573కోట్లతో 2,604 చోట్ల  రైతు వేదికలను నిర్మిస్తున్నారన్నారు.  ప్రతీ 5వేల రైతులకు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. రైతులను సంఘటితం చేయడం, సమావేశాల ద్వారా గిట్టుబాటు ధరలు తెలుసుకోవడం,  సాగులో మెళకువలు నేర్చుకుని, మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి  సీఎం కేసీఆర్​ తీసుకున్న చర్యలు దేశంలో మరెవరూ తీసుకోలేదన్నారు.

కొత్త రెవెన్యూ చట్టం రైతులకు వరం..

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రెవెన్యూ చట్టంతో  రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. గతంలో భూ వివాదాల మూలంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారని.. కొత్త మార్పుల ద్వారా భూ వివాదాలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో  రైతులకు సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రుణాల మాఫీ, రైతు  బీమా వంటి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టేలా కేంద్రం  వ్యవహరించడం తగదన్నారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించాలని సీఎం కేసీఆర్‌‌ను  కోరడంతో,  ఆఫీసర్లతో  రిపోర్టు తెప్పించుకుని కొడకండ్లను ఖరారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  సీఎం ఫోన్ ద్వారా కొడకండ్లతో తనకున్న  అనుబంధాన్ని తెలిపారన్నారు.

వేగంగా సభ  ఏర్పాటు  పనులు

సీఎం కేసీఆర్‌ టూర్​ 4న ఉంటుందని ఆఫీసర్లు భావించగా.. మంచి ముహూర్తం ఉండడంతో 31కి కార్యక్రమం ముందుకు జరిగింది. దీంతె  రైతువేదిక బ్యూటిఫికేషన్​ పనులు వేగంగా చేస్తున్నారు. ఇన్నర్​ రోడ్లు క్లీన్‌ ‌చేసి  గుంతలు పూడ్చారు.  మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చి దిద్దే పనిలో అధికార యంత్రాంగం ఉంది.  బస్టాండ్‌‌ సమీపంలో హెలీప్యాడ్‌‌ పనులు చురుకుగా చేస్తున్నారు. మండల కేంద్రంలో  సీఎం పర్యటన ఏర్పాట్లపై జనగామ కలెక్టర్ కె. నిఖిల,అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌హమీద్‌‌, డీఆర్‌‌డీఏ  పీడీ రామిరెడ్డి,   డీసీపీ, ఏసీపీ, జిల్లా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశారు. కార్యక్రమంలో   రైతుబంధు  సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, డీసీసీబీ వైస్‌‌ చైర్మన్‌‌ కుందూరు వెంకటేశ్వర్‌‌రెడ్డి, జడ్పీటీసీ సత్తమ్మ, ఎంపీపీ దరావత్‌ ‌జ్యోతి, సర్పంచ్‌ పి.‌దయాకర్‌‌  తదితరులు
పాల్గొన్నారు.