
కేసీఆర్ అనే వ్యక్తి కేటీఆర్ ను సీఎం చేయడని, కేటీఆర్ సమర్థత ఏంటో అందరికంటే ఎక్కువ కేసీఆర్ కు తెలుసని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రసుత్తం మంత్రి పదవులు ఆశించిన వాళ్ళే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని అన్నారు. కేటీఆర్ సీఎం అయితే సమస్య అంతా….కవిత- హరీష్- సంతోష్ కు మాత్రమేనన్నారు.
కేటీఆర్ కు సూటి ప్రశ్న
కిరణ్ కుమార్ రెడ్డి- రోశయ్య హయాంలో నేను చేసిన అభివృద్ధి కొడంగల్ లో కనిపిస్తోందని, 2019 జనవరి తరువాత కొడంగల్ గురించి పేపర్ లో రాసిన వార్త ఒక్కటైన టీఆరెస్ చేసినట్లు నిజం అయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ అన్నారు. కేటీఆర్ కి శిత్తశుద్ధి ఉంటే పోలెపల్లి ఎల్లమ్మ పై ఒట్టువేసి నిజాలు బయటపెట్టాలని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని, కేసీఆర్ చెప్పే అబద్ధాల కంటే ఎక్కువ అబద్ధాలు అడుతున్నాడు కాబట్టే కేటీఆర్ సీఎం పదవికి అర్హత సాధించారు కావొచ్చని అన్నారు.
రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలి
ఒకవేళ కేటీఆర్ సీఎం కు సమర్థుడు అయితే కేసీఆర్ అసమర్దుడా? అని ప్రశ్నించారు రేవంత్. ప్రజలు టీఆరెస్ ను ఓట్లు వేసి గెలిపించారని, సీఎం ఎవరు అయితారో అనేది కుటుంబ సమస్య అన్నారు. కేసీఆర్ కు చేసిన తప్పు సరిదిద్దు కోవడానికి మళ్ళీ అవకాశం వచ్చిందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందనుకుంటే రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.