V6 News

సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా ? కంగారు పడకండి ! ఇలా చేస్తే కూల్ అయిపోతుంది..

సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా ? కంగారు పడకండి ! ఇలా చేస్తే కూల్ అయిపోతుంది..

మీ ఫోన్ అప్పుడప్పుడు స్లో అవుతుందా ? స్క్రీన్ బ్రైట్ నెస్ దానంతట అదే తగ్గిపోవడం లేదా ఎండలో ఉన్నప్పుడు బ్యాటరీ వేగంగా అయిపోవడం గమనించారా ? అయితే మీ ఫోన్ పాడైందని కంగారు పడకండి, కానీ అది అతిగా వేడెక్కుతోంది అని అర్థం. మన దేశంలో ఉండే ఎండలకి ఈ సమస్య చాలా సాధారణం...ఐఫోన్‌లకు అనువైన ఆపరేటింగ్ ఉష్ణోగ్రత 16 నుండి 22 డిగ్రీల మధ్య ఉండాలని ఆపిల్ పేర్కొంది. 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు చాలా వేడిగా పరిగణిస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు కూడా ఇలాంటి పరిమితులనే పాటిస్తాయి.

ఒకే సమయంలో చాల యాప్‌లు రన్ అవడం..ఫోన్‌ ఎక్కువగా వాడటం, చుట్టుపక్కల ఉష్ణోగ్రతలు,  సూర్యరశ్మి వంటివి స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అత్యంత సాధారణ కారణాలలో కొన్ని. ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే దెబ్బతినవచ్చు.

విషయం  ఏమిటంటే, మీరు ఎం కొనాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ వేడెక్కకుండా ఉండడానికి కొన్ని యాప్‌లు,  చిట్కాలు మీకోసం.. ఈ చిట్కాలు ఆండ్రాయిడ్ ఇంకా ఐఫోన్ రెండింటిలోనూ పనిచేస్తాయి.

ఫోన్ వేడిని కనిపెట్టే కొన్ని ఉపయోగకరమైన యాప్స్:
1. CPU-Z :

ఇది మీ ఫోన్ లోపల ఎంత వేడి (CPU Temperature) ఉందో క్లియర్ గా చూపిస్తుంది. ఫోన్ మోడల్, ర్యామ్ వంటి వివరాలను కూడా ఇది ఉచితంగా తెలియజేస్తుంది.

2. AIDA64 :
ఇది ఫోన్ హార్డ్‌వేర్ గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ప్రతి కోర్ ఎంత వేడెక్కుతుందో, బ్యాటరీ స్టేటస్ ఏంటో రియల్ టైమ్‌లో చూడొచ్చు.

3. అక్యుబ్యాటరీ :
బ్యాటరీ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఇది బెస్ట్ యాప్. ఏ యాప్స్ బ్యాటరీని ఎక్కువగా వాడుతున్నాయో ఇది చూపిస్తుంది. 

4. థర్మల్ మానిటర్ :
ఫోన్ వేడెక్కినప్పుడు ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. దీనివల్ల మీరు వెంటనే యాప్స్ ఆపేసి ఫోన్‌ను చల్లబరుచుకోవచ్చు.

►ALSO READ | రిలయన్స్ లాభం డౌన్.. ఆదాయం అప్.. వాటాదారులకు రూ.6 డివిడెండ్!

5. థెర్మల్ స్టేట్ (ఐఫోన్ కోసం):
ఐఫోన్ వాడే వాళ్ళు ఫోన్ వేడిని హోమ్ స్క్రీన్ విడ్జెట్ ద్వారానే చూసుకోవచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

6. థర్మోమేటర్ - (ఐఫోన్ కోసం):
మీ ఫోన్ వేడెక్కడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఫోన్ వేడెక్కకుండా జాగ్రత్తలు:
1. ఫోన్ కవర్ తీసేయండి:

ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు లేదా అది వేడెక్కినప్పుడు దానికున్న ప్రొటెక్టివ్ కవర్‌ను తీసేయండి. ఫోన్ కవర్ వేడిని బయటకు పోనివ్వకుండా లోపలే ఆపేస్తుంది. ముదురు రంగు కవర్ల కంటే లేత రంగు కవర్లు తక్కువ వేడిని గ్రహిస్తాయి.

2. అవసరం లేని ఫీచర్లు :
మీరు ఫోన్ వాడనప్పుడు Wi-Fi, బ్లూటూత్, GPS (లొకేషన్) ఆపేయండి. ఫోన్ మరీ ఎక్కువగా వేడెక్కితే కాసేపు ఏర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే త్వరగా చల్లబడుతుంది.

3. చార్జింగ్ పెట్టేటప్పుడు :
చార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడటం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. ఎప్పుడూ ఒరిజినల్ చార్జర్లనే వాడండి. ఫోన్‌ను బెడ్ లేదా సోఫా మీద కాకుండా గట్టిగా ఉండే టేబుల్ లాంటి వాటిపై పెట్టి చార్జింగ్ చేయండి.

4. ఎండ తగలకుండా :
ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఉంచకండి. కారులో ఉన్నప్పుడు డాష్‌బోర్డ్‌పై పెట్టకండి. వీలైతే బయట ఉన్నప్పుడు ఫోన్‌ను బ్యాగులో పెట్టుకోండి.

5. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్:
మీ ఫోన్‌లో వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండండి. ఇవి బ్యాటరీ సమస్యలను, వేడిని తగ్గించడానికి కంపెనీలు పంపే పరిష్కారాలు.