‘అక్క’తో కీర్తి సురేష్ లేడీ డాన్‌‌గా వచ్చేస్తోంది

‘అక్క’తో కీర్తి సురేష్ లేడీ డాన్‌‌గా వచ్చేస్తోంది

సాఫ్ట్ రోల్స్‌‌తో  ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కీర్తి సురేష్  ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటివరకు ట్రెడిషనల్‌‌, పక్కింటి అమ్మాయి పాత్రలతో మెప్పించిన కీర్తి.. ఈసారి  లేడీ డాన్‌‌గా ఆడియెన్స్‌‌ ముందుకు రాబోతోంది. అయితే  ఈ ట్రాన్స్‌‌ఫర్మేషన్ వెండితెరపై కాదు,  బాలీవుడ్ వెబ్‌‌సిరీస్‌‌లో ఉండటం ఆసక్తిని పెంచుతోంది. 

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘అక్క’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.  ఈ సిరీస్‌‌లో ఆమె పవర్‌‌ఫుల్ గ్యాంగ్‌‌స్టర్ పాత్రలో కనిపించనుంది.  ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌‌లో కీర్తి కనిపించబోతుండటంతో అభిమానుల్లో  ఆసక్తి నెలకొంది. ఆమె కోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్‌‌లు డిజైన్ చేశారట.

బాడీ లాంగ్వేజ్‌‌, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ అన్నీ పూర్తిగా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సిరీస్‌‌లో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కథ మొత్తం మహిళల ఆధిపత్యంలో నడిచే  ‘పేర్నూర్’ అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుందట. ఆ ప్రాంతంపై కన్నేసిన మరో లేడీ డాన్‌‌కు ఎదురుగా ‘అక్క’ ఎలా నిలబడింది  ఆమె పోరాటం ఎలాంటి మలుపులు తీసుకుంది  అన్నదే ప్రధాన కథాంశం.

గత ఏడాదే షూటింగ్ ప్రారంభమైన ఈ వెబ్‌‌సిరీస్ పనులు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి.  జూన్ రెండో వారం నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే... కీర్తి సురేష్  ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’లో నటిస్తోంది. అలాగే తమిళ, హిందీలోనూ పలు ప్రాజెక్ట్‌‌లతో బిజీగా కొనసాగుతోంది.