
- సీబీఐ కేసులోనూ అరెస్ట్ అయినందున జైలులోనే ఢిల్లీ సీఎం
- ఈడీ అరెస్టుకు చట్టబద్ధతపై విచారణ లార్జర్ బెంచ్‌కు రిఫర్
- బీజేపీ కుట్రలు ఓడినయ్: ఆప్
- ఆప్ గెలవలేదు.. ఇది కేజ్రీవాల్‌కు ఊరట కాదన్న బీజేపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన టూమెంబర్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. సీఎంగా కొనసాగాల్నా? వద్దా? అనేది ఆయనే నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా బెంచ్ సూచించింది.
కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న నాయకుడని, ఆయన ఇప్పటికే 90 రోజుల పాటు జైలులో ఉన్నారన్న విషయాన్ని తాము విస్మరించలేమని తెలిపింది. ఈడీ కేసులో మే 10వ తేదీన మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులే ప్రస్తుత బెయిల్ కు కూడా వర్తిస్తాయని పేర్కొంది. అప్పట్లో 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు.. సెక్రటేరియట్ కు వెళ్లరాదని, లెఫ్టినెంట్ గవర్నర్ సూచనల మేరకు అత్యవసరమైతే తప్ప ఎలాంటి ఫైల్స్ పై సంతకం చేయొద్దని షరతులు విధించింది.
అలాగే ఈడీ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై బెంచ్ స్పందిస్తూ.. ఈ అంశం జీవించే హక్కుకు సంబంధించినది అయినందున దీనిని లార్జర్ బెంచ్ కు రిఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఈడీ కేసులో తాజాగా బెయిల్ వచ్చినప్పటికీ కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. సీబీఐ కేసులో అరెస్ట్ అయినందున రిలీజ్ కారని అధికారులు చెప్పారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణల కింద తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై ఈ నెల 17న విచారణ జరగనుంది.
సత్యం గెలిచింది.. బీజేపీ కుట్రలు ఓడినయ్: ఆప్
ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ‘సత్యం గెలిచింది.. బీజేపీ కుట్రలు ఓడిపోయాయి’ అని ఆప్ నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ అన్నారు. శుక్రవారం వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ను ఇంకా జైలులోనే ఉంచేందుకు సీబీఐ కేసు పేరుతో బీజేపీ మరో కుట్రను పన్నుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్, ఆప్ నేతలు, మంత్రుల అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయాలతో.. లిక్కర్ స్కాం కేసు పేరుతో బీజేపీ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు.
ఆప్ గెలవలేదు.. కేజ్రీవాల్ దోషే: బీజేపీ
ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వచ్చినంత మాత్రాన ఇది ఆయనకు, ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుపేమీ కాదని బీజేపీ స్పష్టం చేసింది. నిజానికి ఈ కేసులో ఆయన దోషి అని తేల్చేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘తన అరెస్టు అక్రమమని దానిపై తీర్పు చెప్పాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కానీ బెయిల్ కోసం కాదు.
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఉన్నందుకే ఆయనకు సుప్రీంకోర్టు ఊరట ఇవ్వలేదు. అంటే ఆయన నేరం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టేనని భావించాలి” అని అన్నారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారన్నారు. సీఎంగా కొనసాగాలా? వద్దా? అన్నది ఆయనే తేల్చుకోవాలని కోర్టు చెప్పిందని.. అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగరాదని కోర్టు పరోక్షంగా చెప్పిందన్నారు.