కేజ్రీవాల్ 2 కిలోలే తగ్గిండు

కేజ్రీవాల్ 2 కిలోలే తగ్గిండు
  •      ఢిల్లీ సర్కారుకు తిహార్ జైలు అధికారుల రిపోర్టు 
  •     ఎయిమ్స్ డాక్టర్లతో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తిహార్  జైల్లో ఉన్న సీఎం అర్వింద్  కేజ్రీవాల్  2 కిలోల బరువు మాత్రమే తగ్గారని జైలు అధికారులు తెలిపారు. ఈమేరకు ఢిల్లీ హోంశాఖకు నివేదిక అందజేశారు. కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆప్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. ఎయిమ్స్  డాక్టర్లతో ఎప్పటికప్పుడు ఆయనకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. 

‘‘ఏప్రిల్ 1న తిహార్  జైలుకు వచ్చినపుడు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు. అదే నెల 8 నుంచి 28 మధ్య ఆయన ఒక కిలో బరువు పెరిగారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బెయిల్  పొంది తిరిగి జూన్  2న జైలుకు వచ్చాక ఆయన బరువు 63.5 కిలోలు. ఈ నెల 14న చెక్  చేస్తే 61.5 కిలోలుగా తేలింది. అంటే, ఆయన 2 కిలోల బరువు మాత్రమే తగ్గారు. ఇక ముందునుంచీ ఆయన ఇంటి భోజనమే తెప్పించుకుని తింటున్నారు. 

అందులో కొంత తిని మిగిలిన దానిని వెనక్కి పంపుతున్నారు. కేజ్రీవాల్​కు వైద్య పరీక్షలు చేస్తున్న ఎయిమ్స్ మెడికల్ బోర్డుతో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ రెగ్యులర్​గా కాంటాక్టులో ఉన్నారు” అని ఆ రిపోర్టులో జైలు అధికారులు వివరించారు.ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని పేర్కొన్నారు. కాగా.. తిహార్  జైలులో కేజ్రీవాల్​ బరువు తగ్గారని, షుగర్  లెవెల్స్ 50 ఎంజీ కన్నా దిగువకు పడిపోయాయని ఆప్  ఎంపీ సంజయ్ సింగ్ ఇటీవల ఆరోపించారు. కేజ్రీవాల్​ను వెంటనే బయటకు తెచ్చి ట్రీట్మెంట్ చేయించకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.