ఢిల్లీ సీఎంకు మద్దతుగా.. కేజ్రీవాల్ కో ఆశీర్వాద్

ఢిల్లీ సీఎంకు మద్దతుగా.. కేజ్రీవాల్ కో ఆశీర్వాద్
  • క్యాంపెయిన్ ప్రారంభించిన భార్య సునీత
  • వాట్సాప్ నంబర్​కు మెసేజ్ పంపాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఆయన భార్య సునీత ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ వాట్సాప్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈడీ అధికారులు తన భర్తపై తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో అర్వింద్ కేజ్రీవాల్​కు ప్రజల మద్దతు ఎంతో అవసరమన్నారు. ఈమేరకు శుక్రవారం ఓ వీడియో ను ట్విట్టర్​లో పోస్టు చేశారు. దేశంలోని అత్యంత నియంతృత్వ, అవినీతి శక్తులతో తన భర్త పోరాడుతున్నారని తెలిపారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ‘‘అర్వింద్ కేజ్రీవాల్​కు తమ మద్దతు తెలియజేసేందుకు వాట్సాప్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాను. 82973 24624, 9700 297002 నంబర్లకు మెసేజ్​లు పంపండి. ఆశీర్వాదం, మద్దతు, అభినందనలే కాకుండా.. ఇతర ఏ సందేశమైనా ఈ వాట్సాప్ నంబర్​కు పంపొచ్చు. గురువారం అర్వింద్ కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. ఆయన చెప్పిందంతా దేశం మొత్తం విన్నది. ఎవరైనా వినకపోతే వినండి. కోర్టు ముందు ఏం మాట్లాడాలన్న ధైర్యం కావాలి. అది కేజ్రీవాల్​కు చాలా ఉంది’’ అని చెప్పారు. 

మా ఆయనేంటో నాకు తెలుసు

‘అవినీతి పరులపై పోరాడేందుకు మద్దతు కావాలని కేజ్రీవాల్ కోర్టులో చెప్పారు. 30 ఏండ్లుగా ఆయనతో కలిసి జీవిస్తున్నాను. నా భర్త అణువణువులో దేశభక్తి నిండి ఉంది. బ్రిటీష్ సైన్యంతో స్వాతంత్ర్య సమరయోధులు ఎలా అయితే ఫైట్ చేశారో.. అదేవిధంగా ఇక్కడి నియంతృత్వ, అవినీతిపరులతో మా ఆయన పోరాటం చేస్తున్నారు’’ అని సునీత కేజ్రీవాల్ అన్నారు. ‘‘మీ సోదరుడికి మద్దతిచ్చినట్లే మా ఆయనకు కూడా సపోర్ట్ ఇవ్వండి. అందరూ కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది’’ అని ఆమె తెలిపారు. చాలా మంది తల్లులు, సోదరులు తనకు ఫోన్ చేశారని చెప్పారు. మీకు అర్వింద్ కేజ్రీవాల్​పై ఉన్న అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా పంపించాలని ఆమె కోరారు. మీ మెసేజ్​లు చదివితే 
ఆయన ఎంతో సంతోషిస్తారని చెప్పారు.