మోదీతో విజయన్ రహస్య ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి

మోదీతో విజయన్ రహస్య ఒప్పందం  :  సీఎం రేవంత్ రెడ్డి

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని, ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వాయనాడ్ లో జరిగిన రైతుల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రజలు కష్టించే మనస్తత్వం ఉన్నవారని, దుబాయ్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని అన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. 

బంగారం స్మగ్లింగ్ లో విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్నారు. ఈ విషయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. విజయన్ పై ఈడీ, ఐటీ  కేసులున్నా.. మోదీ ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీతో విజయన్ రహస్యం ఒప్పందం చేసుకోవడమే ఇందుకు కారణమని చెప్పారు.  తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్ , ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రం తో నిధుల కోసం పోరాడుతున్నాయని అన్నారు. కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదని చెప్పారు. పైకి  సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడి గా కనిపిస్తున్న విజయన్ కమ్యూనిస్టు కాదని కమ్యూనలిస్టు అని పేర్కొన్నారు. 

వాయనాడ్ లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ సీపీఎంతో పాటు  కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.  ఈడీ, ఐటీ కేసులున్ననని రోజులు సీపీఎం కోసం విజయన్ పనిచేయరని చెప్పారు.జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధాని గా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.