కేరళలో కరోనా కట్టడికి కమాండోలు

కేరళలో కరోనా కట్టడికి కమాండోలు
  • లాక్‌డౌన్‌ స్ట్రిక్ట్‌ చేసేందుకు దించిన ప్రభుత్వం

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్‌గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు చెందిన 25 మంది కమాండోలు పుంథూరులో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. చేపల బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా, తమిళనాడునుంచి బోట్లు రాకుండా కోస్ట్‌గార్డ్‌లు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మెరైన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బలగాలను మోహరించారు. కేరళలో ఇప్పటి వరకు 5894 కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2415 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్కరోజే 22 కేసులు నమోదయ్యాయి. మన దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే.