కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి

కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి

కొల్లం/న్యూఢిల్లీ : అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్.బిందు మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు లేఖ రాశారు. ఇన్నర్​వేర్ తీసి ఎగ్జామ్​ హాల్​లోకి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేశారని, ఈ వార్త విని షాక్​కు గురైనట్టు మంత్రి బిందు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ స్పందించాలని, ఈ వ్యవహారంలో కలగజేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్ష​ రాసేందుకు వచ్చిన విద్యార్థినులపట్ల ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. బలవంతంగా ఇన్నర్​వేర్​ విప్పించడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు. న్యాయబద్దంగా ఎగ్జామ్​ నిర్వహించే బాధ్యత ఏజెన్సీకి ఉంటుందని, అయితే ఇలా ప్రవర్తించడం మాత్రం దారుణమని లేఖలో పేర్కొన్నారు. 

కేరళ మహిళా కమిషన్​కు ఫిర్యాదులు

నీట్​ పరీక్షలు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎన్​టీఏ అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్​ చేశారు. కేరళ మహిళా కమిషన్​ కూడా స్పందించింది. తమకు కూడా రెండు ఫిర్యాదులు అందినట్టు కమిషన్​ వివరించింది. ఇప్పటికే కొల్లం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. 

విద్యార్థిని ఆరోపణల్లో నిజం లేదు: ఎన్​టీఏ

అమ్మాయిల ఇన్నర్​వేర్​ తీసి ఎగ్జామ్​కు అనుమతించారని విద్యార్థిని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్​టీఏ అధికారులు తేల్చి చెప్పారు. తప్పుడు ఉద్దేశంతోనే ఎన్​టీఏపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

కొల్లంలో నిరసనలు

కేరళలో కొన్నిచోట్ల మంగళవారం ఆందోళనలు జరిగాయి. కొల్లం జిల్లా ఆయుర్​లోని ప్రైవేట్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్​పై నిరసనకారులు దాడి చేశారు. కుర్చీలు, గ్లాసులు పగులగొట్టారు. పోలీసులు లాఠీచార్జ్​ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.