ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి

కొచ్చి : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. కేరళలో  పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు అడ్డంకులు సృష్టించింది. ఒమిక్రాన్ కారణంగా యూకేలో ఉన్న వరుడు భారత్ కు తిరిగొచ్చే పరిస్థితి లేకపోవడంతో వధువు కోర్టును ఆశ్రయించింది. ఆన్ లైన్ లో పెళ్లికి అనుమతించాలని పిటీషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేరళకు చెందిన లాయర్ రింటూ థామస్.. అనంత కృష్ణన్ హరికుమార్ కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 23న ముహుర్తంగా నిర్ణయించుకున్నారు. అయితే రూపం మార్చుకున్న ఒమిక్రాన్ వారి వివాహానికి అడ్డుపడింది. బ్రిటన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న నాయర్ బుధవారం స్వదేశానికి రావాల్సి ఉండగా.. ప్రయాణ ఆంక్షలు ఉండంటతో రాలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో ఆందోళన చెందిన రింటూ కోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్లో పెళ్లి చేసుకునేందుకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురం సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
రింటూ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన జడ్జి జస్టిస్ ఎన్.నగరేశ్ సానుకూలంగా స్పందించారు. గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ వివాహాలకు హైకోర్టు అనుమతించిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. వివాహ తేదీ, సమయం నిర్ణయించి ఆన్ లైన్ పెళ్లికి చట్టప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించింది.