
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆ రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే తీర్మానం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కొంత మేర కోత విధించాయి. కేరళలోనే ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.
కరోనా నియంత్రణ కోసం నిధుల కొరత రాకుండా చూసేందుకు ఆరు నెల పాటు ప్రతి నెలా ఆరు రోజుల జీతం కట్ చేస్తూ గత నెలలో జీవో జారీ చేసింది పినరయి విజయన్ సర్కారు. అయితే ఈ నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిపై ఏప్రిల్ 24న కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదని వాదనలు వినిపించాయి. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జీతాల కోతపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై మంగళవారం స్టే విధించింది. దీంతో చట్టపరమైన సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. విపత్తు సమయాల్లో ఉద్యోగుల జీతాల్లో 25 శాతం వరకు వాయిదా వేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తూ సవరణ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్.