కేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరీ అమ్మ ఇకలేరు

 కేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరీ అమ్మ ఇకలేరు

తిరువనంతపురం: ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు, కేరళ రాష్ట్ర తొలి రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ గౌరీ అమ్మ (102) కన్నుమూశారు. కొద్ద రోజులుగా అనారోగ్యం.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స ఫలించక మంగళవారం తుదిశ్వాస విడిచారు. అలప్పుజ జిల్లాలోని చెర్తాలాలో 1919లో జులై 14న ఆమె జన్మించారు. చిన్ననాటి నుండే చదువులో చురుకుగా ఉంటూ.. మగపిల్లలతో సమానంగా చదువులో పోటీపడి రాణించింది. కేరళలోని ఈజవా వర్గానికి చెందిన మొదటి మహిళా న్యాయ విద్యార్థినిగా సంచలనం రేపింది. అలా తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1957లో ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నేతృత్వంలోని మొదటి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వంలో ఆమె రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా భూ సంస్కరణల బిల్లును తీసుకువచ్చారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు ఆమె సీపీఐ(ఎం) పార్టీలో చేరారు. 1987లోనే కేరళకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం రాగా.. రాజకీయాల కారణంగా తప్పుకున్నారు.
1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడంతో జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్‌) పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే పార్టీని యూడీఎఫ్‌లో విలీనం చేసి.. పార్టీ ప్రభుత్వంలో మరోసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆమె చివరిసారిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వయసు సమస్యలతో రాజకీయాలకు దూరం జరిగారు.