ICC ODI Rankings: ఆస్ట్రేలియాపై విశ్వరూపం.. అగ్రస్థానానికి సౌతాఫ్రికా స్పిన్నర్

ICC ODI Rankings: ఆస్ట్రేలియాపై విశ్వరూపం.. అగ్రస్థానానికి సౌతాఫ్రికా స్పిన్నర్

సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం (ఆగస్టు 20) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఈ సఫారీ స్పిన్నర్ రెండు స్థానాలు ఎగబాకి టాప్ కు చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియాతో మంగళవారం (ఆగస్టు 19) జరిగిన తొలి వన్డేలో మహరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీలను తన స్పిన్ మాయాజాలంతో ఔట్ చేశాడు. 

ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మహరాజ్.. ఒక రోజు తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ కు దూసుకొచ్చాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ రెండో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానంలో ఉన్న కుల్దీప్ యాదవ్ ర్యాంక్ మూడో స్థానానికి దిగజారింది.  జడేజా 9 ర్యాంక్ లో నిలిచాడు. నమీబియా స్పిన్నర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ 13, బుమ్రా 14,  సిరాజ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్ విభాగానికి వస్తే జడేజా ఒక్కడే టీమిండియా నుంచి 10 స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ ఓమర్జాయ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 

ALSO READ : ఫ్యాన్స్‌కు బిగ్ టెన్షన్: టాప్-100లో కూడా కనిపించని పేర్లు..

వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే గిల్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ అజామ్ రెండో ర్యాంకు లో ఉన్నాడు. ఇండియా నుంచి శ్రేయాస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు. కివీస్ ఆటగాడు మిచెల్, శ్రీలంక కెప్టెన్ అసలంక, ఐర్లాండ్ హ్యారీ టెక్టర్ వరుసగా 3,4,5 ర్యాంక్ లలో నిలిచారు. ఇండియా నుంచి శ్రేయాస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంక్ లు టాప్-100 లో కూడా  లేకపోవడం షాక్ కు గురి చేస్తోంది.