
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కనిపించకపోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఐసీసీ బుధవారం (ఆగస్టు 20) ప్రకటించిన లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ, రోహిత్ కనిపించలేదు. టాప్-100 లో కూడా వీరిద్దరూ లేకపోవడంతో అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. రోహిత్, కోహ్లీ కాకుండా మిగిలిన వారి స్థానాలు అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గత వారం (ఆగస్టు 13) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోకో జోడీకి వన్డేల్లో అత్యుత్తమ ర్యాంక్ లు లభించాయి.
రోహిత్ శర్మ రెండో ర్యాంక్ లో ఉంటే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. బాబర్ (751) ఇటీవలే కాలంలో విఫలం కావడంతో రోహిత్ (756) రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. తొలి స్థానంలో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ (784) ఉన్నాడు. టాప్ -4 ఏకంగా ముగ్గురు టీమిండియా క్రికెటర్లు ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఒక్క వారానికే టాప్-5 లో ఉన్న వీరి ర్యాంక్ లు ఏమైయ్యాయో అర్ధం కావడం లేదు. ఇది ఐసీసీ లోపమా లేకపోతే రోహిత్, కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ఏమైనా ప్రకటించబోతున్నారానే విషయం తెలియాల్సి ఉంది.
ALSO READ : CSKను సమం చేయాలంటే RCBకి 72 సంవత్సరాలు పడుతుంది
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెగ్యులర్ గా వన్డే క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. వీరిద్దరూ చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడి అద్భుతంగా రాణించారు. అక్టోబర్ లో ఆస్ట్రేలియాపై జరగనున్న వన్డే సిరీస్ తో మరోసారి మైదానంలో కనిపించనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గత కొంతకాలంగా వన్డే రిటైర్మెంట్ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి వన్డే కెరీర్ ఇక ముగిసిందని.. జట్టుకు వీరి అవసరం ఇక లేదని.. బీసీసీఐ యంగ్ ఇండియా వైపు అడుగులు వేస్తోందని వార్తలు వచ్చాయి. ఓ వైపు వీరిద్దరి ఫ్యాన్స్ వీరి కోసం ఎదురు చూస్తుంటే అంతలోనే వీరి ర్యాంక్ లు కనుమరుగవడం ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేస్తోంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే గిల్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ అజామ్ రెండో ర్యాంకు లో ఉన్నాడు. ఇండియా నుంచి శ్రేయాస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు. కివీస్ ఆటగాడు మిచెల్, శ్రీలంక కెప్టెన్ అసలంక, ఐర్లాండ్ హ్యారీ టెక్టర్ వరుసగా 3,4,5 ర్యాంక్ లలో నిలిచారు.