1.32 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తం

1.32 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తం

సికింద్రాబాద్/పాలమూరు/వరంగల్​, వెలుగు: ఉద్యోగాల భర్తీ విషయంలో కేటీఆర్​ చేసిన ప్రకటన తప్పని తేలితే అందరం రాజీనామా చేసి వెళ్లిపోతామని, తానైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని టీఆర్​ఎస్​ సెక్రటరీ జనరల్​ కేకే  చాలెంజ్​ చేశారు. తెలంగాణలో కన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువగా ఇచ్చినా తాను, మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కూడా రాజీనామా చేస్తారని మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లెక్కలు చెప్తానని, చర్చకు మాత్రం రానని ‘వరంగల్​’ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. ఈ ముగ్గురు లీడర్లు శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు.

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట: కేకే

ఎంప్లాయిమెంట్​ ఇష్యూ గురించి అసలు డిబెట్​ ఎందుకని ఎంపీ కె.కేశవరావు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, లెక్కలతో పాటు ఉన్నాయని, ఇవ్వలేదని నిరూపిస్తే అందరం రాజీనామా చేసి వెళ్లిపోతామని బేగంపేట లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్​ఎస్​ సర్వసభ్య సమావేశంలో అన్నారు. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో ప్రభుత్వం పక్కా లెక్కలతో తెలిపిందని, అనుమానాలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ లెక్కలు తప్పని రుజువు చేస్తే  తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు రెడీ అని కేకే సవాల్​ విసిరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ ఎమ్మెల్సీ  ఎన్నికల ముందు ప్రతిపక్షాలు అనవసరంగా ఉద్యోగ భర్తీపై, పీఆర్​ఎసీ , ప్రమోషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు.

మీ రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగమన్నా ఎక్కువిచ్చిన్రా: ప్రశాంత్రెడ్డి

తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలకన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువగా ఇచ్చినట్లు నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్​గౌడ్ కూడా రాజీనామా చేస్తారని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్​నగర్​లో జరిగిన టీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు సీఎం కేసీఆర్​తో మంచి పరపతి ఉందని, అలాంటి పేరును ఇంకా పెంచాలంటే  పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరగటం లేదన్నారు. 2014 కన్నా ముందు పరిస్థితిని, ఇపుడున్న పరిస్థితులను చూసి ఓటర్లు  నిర్ణయం తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఆరేండ్లలో ఎన్ని ఉద్యోగాల ఇచ్చామో పక్కా లెక్కలున్నాయన్నారు.

ఎక్కడా లెక్క తప్పలె: పల్లా

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లెక్కలు ఇస్తానని, చర్చకు మాత్రం రానని ‘వరంగల్’​ టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. వర్సిటీల్లో వీసీ, ఇతర పోస్టులు భర్తీ చేయకుండా బీజేపీ అనుబంధ సంఘమే అడ్డుపడిందని ఆరోపించారు. హన్మకొండలోని వరంగల్ ప్రెస్​ క్లబ్​లో శనివారం ‘మీట్​ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. కేయూతో పాటు రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల్లో 1,050 పోస్టులు భర్తీ చేయాలని  2017లో ప్రభుత్వం ఆర్డర్​ ఇస్తే.. ఆర్​ఎస్​ఎస్​, బీజేపీకి సంబంధించిన ‘ఔటా’ సంఘం డిపార్ట్​మెంటల్​ రిజర్వేషన్​ కావాలని, ఫ్యాకల్టీ రిజర్వేషన్ వద్దని కోర్టుకు వెళ్లిందన్నారు. దీంతోనే వర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, భర్తీ చేసిన జాబ్​ల వివరాలు డిపార్ట్​ మెంట్​, డిసిగ్నేషన్​ వారీగా ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ  విషయంలో ఎక్కడా లెక్కలు తప్పలేదని, ఒకవేళ ఆ లెక్కలు తప్పని నిరూపిస్తే తప్పనిసరిగా సవరించుకుంటానని పేర్కొన్నారు.