
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఆఫ్రికన్ దేశాలను గడగడలాడించిన మంకీపాక్స్ ఇటీవల భారత్‌లో కూడా వెలుగు చూసింది. విదేశాల నుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఇందులో ఓ వ్యక్తికి ప్రమాదకరమైన క్లాడ్ 1బి ఎంపాక్స్ వేరియంట్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దేశంలో డేంజరస్ క్లాడ్ 1బి ఎంపాక్స్ వేరియంట్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భారత్‌లో మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది.
ఈ మేరకు మంకీపాక్స్ నివారణకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
అన్ని అనుమానిత ఎంపాక్స్ వేరియంట్ కేసులను వేరు వేరుగా నమోదు చేయాలని, కఠినమైన ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులతో దగ్గర ఉన్న వారిని కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించాలని పేర్కొంది. ఎంపాక్స్ లక్షణాలు ఉన్నవారి నుండి సేకరించిన శాంపిల్స్‌ను వెంటనే ల్యాబ్‌లకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ALSO READ | క్వాలిటీ టెస్టులో కొన్ని కంపెనీల పారాసిటమాల్ ఫెయిల్... సీడీఎస్సీఓ వెల్లడి
ఎంపాక్స్ పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను క్లౌడ్ వేరియంట్ తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ల్యాబ్‌లకు పంపించాలని పేర్కొంది. మంకీ పాక్స్ కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ట్రీట్ మెంట్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దేశంలో ఎంపాక్స్ వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని..రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ విషయంలో అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.