
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే క్రాస్ చేసింది. కాంగ్రెస్ విజయం ఖాయం అవడంతో కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు కీలకమైన హామీలే విజయానికి కారణమయ్యాయి. ముఖ్యంగా మహిళలు, యువతనే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బాగా కలిసి వచ్చాయి.
* ప్రతీ కుటుంబంలోని మహిళా పెద్దకు ప్రతి నెల 2 వేల రూపాయలను గృహలక్ష్మి పథకం ద్వారా ఇస్తామని కాంగ్రెస్ తన మొదటి హామీగా మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ హామీని కాంగ్రెస్ ప్రతి ఇంటికి చేరువయ్యేలా విస్తృతంగా ప్రచారం చేసింది.
* ఇక గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
* నిరుద్యోగులపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల రూ.3 వేలు, అలాగే డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువనిధి పథకం ద్వారా ప్రతి నెల రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో చాలా మంది యువత కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు.
* ఇక దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ‘అన్న భాగ్య’ పథకం ద్వారా రూ.10 కేజీల చొప్పున బియ్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇచ్చింది.
* పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలను బొమ్మై ప్రభుత్వం పెంచింది. ఈ ఎఫెక్ట్ ఆ రాష్ట్ర ప్రజలపై బలంగా చూపింది. ఈ క్రమంలోనే మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి మహిళా ఓటర్లు ఆకర్షితులయ్యారు.
మొత్తంగా మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హామీలు ఇవ్వడంతో ఆ పార్టీ పట్ల ఓటర్లు మొగ్గుచూపారు.