Op SINDOOR: ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ఆధారాలతో సహా వివరించిన ఇండియన్ ఆర్మీ

Op SINDOOR: ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ఆధారాలతో సహా వివరించిన ఇండియన్ ఆర్మీ

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ఆధారాలతో సహా వివరించారు. ‘ఆపరేషన్ సిందూర్’పై త్రివిధ దళాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని.. పుల్వామా, కాందాహార్, హైజాకర్ ఉగ్రవాదిని చంపేశామని భారత ఆర్మీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మీడియాకు వివరించారు.

కీలకమైన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. మే 7వ తేదీ సాయంత్రం డ్రోన్లు, మిసైల్స్ భారత్ వైపు దూసుకొచ్చాయని, భారత రక్షణ వ్యవస్థ ప్రతీ పాక్ డ్రోన్ను పేల్చేసిందని డీజీఎంవో పేర్కొన్నారు. పాక్ జరిపిన ఈ దుశ్చర్యకు కౌంటర్ గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై దాడులు చేశామని చెప్పారు.

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ నుంచి బలంగా సమాధానం చెప్పాలని నిర్ణయించామని, ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్న లక్ష్యంతోనే ‘ఆపరేషన్ సిందూర్’ మొదలైందని తెలిపారు. సరిహద్దుకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించామని, 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామని డీజీఎంవో వివరించారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని వెల్లడించారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్ అమాయక పౌరులపై దాడులు చేసిందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకుందని డీజీఎంవో చెప్పారు.