ఈ ఏడాది ఎన్నో ఇష్యూస్ పై కీలక తీర్పులు 

ఈ ఏడాది ఎన్నో ఇష్యూస్ పై కీలక తీర్పులు 

ఈ ఏడాది రాజకీయ పరిణామాల్లో కీలక విషయాలు చోటు చేసుకున్నాయి. కేంద్రమంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. నాగాలాండ్ లో కాల్పుల ఘటన, అటు సీడీఎస్ బిపిన్ రావత్ మరణం విషాదాలు నింపాయి. ఈ ఏడాది సుప్రీం కోర్టు కొన్ని కేసుల్లో కీలక తీర్పులిచ్చింది. పెగాసస్ ఇష్యూ, పండోరా పేపర్స్ లీకేజ్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఏడాది సుప్రీం కోర్టు కొన్ని ఇష్యూస్ పై కీలక తీర్పులు ఇచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఏడాది ఏప్రిల్ లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా సుప్రీం న్యాయమూర్తుల బృందంలో ముగ్గురు మహిళా జడ్జిలకు అవకాశం కల్పించారు. జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ నాగరత్న, జస్టిస్ త్రివేది ఉన్నారు. ఈ ఏడాది సుప్రీం ఇచ్చిన కీలక తీర్పుల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉంది. మహారాష్ట్ర సర్కారు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, 50 శాతం కోటా వరకే పరిమితం చేయాలన్నది. 29 ఏళ్ల కిందటి మండల్ తీర్పుపై పునస్సమీక్ష కోసం విస్తృతస్థాయి ధర్మాసనానికి పంపేందుకు సుప్రీం బెంచ్ నిరాకరించింది. పెగాసస్ స్పైవేర్ ఇష్యూపైనా సుప్రీం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దేశ భద్రత పేరు చెప్పి ప్రతిసారీ దర్యాప్తుల నుంచి దూరం జరిగే పరిస్థితి ఉండబోదని కామెంట్ చేసింది. అటు లఖీంపూర్ ఖేరీ ఘటనలో విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా యూపీ సిట్ తో కలిసి పని చేసేలా మాజీ న్యాయమూర్తిని సుప్రీం అపాయింట్ చేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అగ్రి చట్టాలు రద్దు కాకముందు ఈ ఇష్యూపై విచారణ జరిగితే... ఆ చట్టాలపై సుప్రీం స్టే విధించింది. చివరకు ప్రభుత్వం వాటిని రద్దు చేసేసింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల సత్వర పరిష్కారంపై సుప్రీం కోర్టు దృష్టి పెట్టింది. 


ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు తిరిగి దఖలు పరిచేలా 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పడింది. ఈ విషయంలో రాష్ట్రాలకు తిరిగి అధికారం ఇవ్వడంతో దేశంలోని 671 వెనుకబడిన కులాలు ప్రయోజనం పొందుతాయి. నాగాలాండ్‌లో సైన్యం చేపట్టి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో తీవ్రవాదులనుకుని పొరపాటున స్థానికులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 14 మందికి పైగా చనిపోయారు. మాయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ కూడా ఈ ఘటనలో చనిపోయారు. సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్థులు చనిపోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుని భద్రతా బలగాలను చుట్టుముట్టారు. సైనికుల వాహనాలకు నిప్పటించి సైన్యంపైకి దూసుకొచ్చారు. ఈ సమయంలో వారి నుంచి తమను తాము కాపాడుకోడానికి సైన్యం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఈ మొత్తం ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. విషాదాన్ని నింపింది. 

ఈ ఏడాది మరో విషాదకర ఘటన సీడీఎస్ బిపిన్ రావత్ మరణం. ఊటీ దగ్గర ఓ సెమినార్ లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి భార్యతో సహా వెళ్లిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులో కూలిపోయింది. ఆ ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న వారంతా చనిపోయారు. అంతా టాప్ ర్యాంకు సైనిక అధికారులే ఉన్నారు. కమాండ్స్ వ్యవస్థ కోసం కీలకంగా పని చేస్తున్న రావత్ అకాల మరణం సైన్యానికి, దేశానికి తీరని లోటుగా మిగిలిపోయింది. దేశంలో పెగాసస్ ఇష్యూ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని రకరకాల రంగాల్లో ఉన్న ప్రముఖులపై నిఘా పెట్టారన్న ప్రచారంతో విపక్షాలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యాయి. ఇజ్రాయెల్ స్పైవేర్ సంస్థకు చెందిన పెగాసస్ మిస్డ్ కాల్ ఇచ్చినా వారి ఫోన్లలోకి వెళ్లిపోయేలా ఉందని, దీంతో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. పెగాసస్ కు సంబంధించి అమెరికా, యూకేల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. అక్కడ వెలుగు చూసిన ఇష్యూతో మన దేశంలోనూ కొందరిపై నిఘా పెట్టారన్న రిపోర్టులు వచ్చాయి. మరోవైపు ఇజ్రాయెల్ సంస్థ తమ కస్టమర్ల గురించి, వారి దేశం గురించిన విషయాలు బహిరంగంగా వెల్లడించబోమని ప్రకటించింది. సుప్రీం విచారణ సందర్భంగా పెగాసస్ వాడిందీ వాడలేనిది చెప్పలేని విషయాన్ని కేంద్రం చెప్పలేకపోయింది. 


పండోర పేపర్ లీక్‌ ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ అక్టోబర్ 3న 200 దేశాలకు చెందిన  పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పేర్లతో ఉన్న 11.9 మిలియన్ ఫైళ్లను లీక్ చేసింది. నల్లడబ్బును విదేశాల్లో దాచిపెట్టిన వారి వివరాలను ఐసీఐజే తెలిపింది. ఈ లిస్టులో దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు సహా 300 మందికి పైగా పేర్లు ఉన్నాయి. ఇది కూడా దేశంలో తీవ్ర ప్రకంపనలే సృష్టించింది. ఎయిరిండియా ప్రైవేటీకరణకు ఈ ఏడాదే శుభం కార్డు పడింది. ఒకప్పుడు దేశీయ విమానయాన రంగంలో మహారాజాగా వెలుగొందిన ఎయిరిండియా ఆ తర్వాతి కాలంలో కష్టాల మధ్య కొనసాగింది. స్వాతంత్ర్యం రాక ముందు టాటా ఎయిర్ లైన్స్ గా ఉన్న ఈ సంస్థ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. చివరకు మళ్లీ ఇన్నాళ్లకు టాటాల చేతికే ఎయిరిండియా వచ్చి చేరింది. ఎయిరిండియాను అత్యధికంగా 18 వేల కోట్ల రూపాయల బిడ్‌తో టాటా గ్రూప్‌ దక్కించుకుంది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా దాని అనుబంధ కంపెనీల మొత్తం రుణభారం 61,562 కోట్ల రూపాయలుగా ఉంది. ఎయిరిండియా రోజుకు 20 కోట్ల రూపాయల నష్టంతో నడుస్తుండడంతో అమ్మడమే బెటర్ అని కేంద్రం డిసైడ్ అయింది. దీంతో టాటా దక్కించుకుంది. 

భారత్ లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 37 శాతం ఉగ్రదాడులు జమ్మూకాశ్మీర్ లోనే నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది భారత్ లో 679 ఉగ్రదాడులు జరిగితే.. అందులో 567 మంది చనిపోయారు. ఉగ్రదాడుల్లో భారత్ టాప్-10లో ఉన్నట్లు US స్టేట్ డిపార్ట్ మెంట్ రిపోర్ట్ తెలిపింది. జమ్మూకాశ్మీర్ లో 257 ఘటనలు జరిగితే.. ఛత్తీస్ గఢ్ లో 145 ఘటనలు, జార్ఖండ్ లో 69 ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. జమ్మూకాశ్మీర్ లో గతేడాది 244 ఉగ్రదాడులు మాత్రమే జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఉగ్రదాడులు తగ్గాయని కేంద్రం తెలిపింది.