
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చిస్తున్నారు. మంత్రులతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గ ఇంచార్జ్ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
అభ్యర్థి ఎంపిక, ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, కొత్త సాంక్షన్స్, సంక్షేమ పథకాల పంపిణీ, ముస్లిం గ్రేవి యార్డ్తో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. డివిజన్ల, బూత్ స్థాయిలో కార్యకర్తల పని తీరు, సమన్వయం వంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ఆశావహుల పని తీరుపైన డిస్కస్ చేయనున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నెగ్గి రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ప్రజాధరణ ఏ మాత్రం తగ్గలేదని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు.. గ్రేటర్లో తమకు మంచి పట్టు ఉండటంతో జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయ్యాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బరిలోకి దించనున్నట్లు బీఆర్ఎస్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం నిర్వహిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.