
జీఎస్టీ విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం అంగీకరించింది. 12 శాతం, 28 శాతం స్లాబులు ఎత్తేసి.. 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక సమావేశంలో మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
28% నుంచి 18%కి తగ్గిస్తే.. తగ్గే ధరలు ఇవే..
28 శాతం స్లాబులోని వస్తువులన్నీ 18 శాతం స్లాబులోకి వస్తే ఫోన్లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్, ప్రింటర్స్ వంటి ధరలు తగ్గుతాయి. మానిటర్స్, ప్రొజెక్టర్స్, సెట్-టాప్ బాక్సెస్, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్స్, వీడియో గేమ్ కన్సోల్స్, స్పీకర్స్, హెడ్‌ఫోన్స్, ఫ్యాన్స్, గ్రైండర్స్, మిక్సర్స్, వాటర్ హీటర్స్, హెయిర్ డ్రైయర్స్, ఎలెక్ట్రిక్ ఐరన్స్ ధరలు దిగొస్తాయి.
తగ్గనున్న రేట్లు!
12 శాతం స్లాబులోని వస్తువులన్నీ 5 శాతం స్లాబ్‌లోకి మారిస్తే.. ప్రధానంగా వెన్న, నెయ్యి, బాదం, నట్స్, సీడ్స్, బిస్కెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్/ఫ్రూట్ ప్రిపరేషన్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. రోజూ ఉపయోగించే టూత్‌పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్, పేపర్, బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ధరలు దిగివస్తాయి. అదేవిధంగా బట్టలు, బూట్లు, చెప్పుల ధరలు తగ్గుతాయి. సైకిళ్లు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ధరలు దిగొస్తాయి.
ప్రస్తుతం ఉన్న స్లాబులు ఇలా..
- జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం స్లాబులున్నాయి. ఇవి కాకుండా 0%, స్పెషల్ రేట్స్ (సెస్ సహా) ఉన్నాయి.
- జీరో శాతం స్లాబులో పాలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, ఉప్పు, గ్రెయిన్స్, మెడికల్ సర్వీసులు వంటివి వస్తాయి.
- 5 శాతం స్లాబులో రోజువారీ అవసరాలైన చక్కెర, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, స్పైసెస్, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, కొన్ని మెడిసిన్స్ వస్తాయి.
- 12 శాతం స్లాబులో స్టాండర్డ్ గూడ్స్ వస్తాయి. అందులో బట్టర్, నెయ్యి, ప్రాసెస్డ్ ఫుడ్, మొబైల్స్, కంప్యూటర్స్, సైకిళ్లు, రెడీమేడ్ గార్మెంట్స్ (రూ.వెయ్యిపైన), ఫుట్‌వేర్ (రూ.500పైన) వస్తాయి.
- 18 శాతం స్లాబులో ఎలక్ట్రానిక్స్, సర్వీసెస్ వస్తాయి. వీటిలో క్యాపిటల్ గూడ్స్, ఐటీ సర్వీసెస్, హోటల్ రూమ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి.
- 28 శాతం స్లాబ్‌లో లగ్జరి, సిన్ గూడ్స్ వస్తాయి. కార్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్, సిమెంట్, పెయింట్స్, పెర్ఫ్యూమ్స్, టొబాకో, ఏరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వస్తువులపై కాంపెన్సేషన్ సెస్ విధిస్తారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు వేస్తున్నారు.