చంద్రమోహన్​ది క్రిమినల్ మైండ్

చంద్రమోహన్​ది క్రిమినల్ మైండ్
  • అనురాధను చంపిన తర్వాత  ఆమె చార్​ధామ్​కు వెళ్లినట్లు సీన్ క్రియేట్ చేసేందుకు ప్లాన్
  • నర్సు హత్య కేసు నిందితుడి రిమాండ్​ రిపోర్టులో కీలక వివరాలు

హైదరాబాద్‌‌,వెలుగు: నర్సు అనురాధ హత్య కేసు నిందితుడు  చంద్రమోహన్​  రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటికొస్తున్నాయి. అనురాధ చనిపోతే ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్ధేశంతోనే చంద్రమోహన్  ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చార్‌‌‌‌ధామ్‌‌ యాత్రకు వెళ్లి తిరిగి రాలేదనే విధంగా సీన్ క్రియేట్‌‌ చేసేందుకు చంద్రమోహన్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. ముక్కలుగా చేసిన డెడ్‌‌బాడీ పార్ట్స్​ను ఒక్కొక్కటిగా మాయం చేసి అనురాధ సెల్‌‌ఫోన్‌‌ను చార్‌‌‌‌ధామ్‌‌లో పడేసి వచ్చేందుకు స్కెచ్‌‌ వేసినట్లు తేల్చారు. ఈ నెల15న మలక్‌‌పేట తీగలగూడలోని మూసీ ఒడ్డున మొండెం లేని తల దొరికిన సంగతి తెలిసిందే.400 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్​లను పరిశీలించి.. పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడు చంద్రమోహన్‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.

మ్యాట్రిమోనీలో అనురాధ ప్రకటనలు

చంద్రమోహన్‌‌ క్రిమినల్‌‌ ప్లాన్‌‌ గురించి రిమాండ్‌‌ రిపోర్టులో బయటికొచ్చిన కీలక వివరాలను పోలీసులు వెల్లడించారు. అనురాధ, నిందితుడు గత15 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ధిక వ్యవహారాలతో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనగాఅనురాధ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.ఇందుకోసం మ్యాట్రిమోనీలో అనురాధ ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. పెళ్లి చేసుకోబోతున్నానని తన డబ్బు, నగలు తిరిగివ్వాలని ఒత్తిడి చేసిందని పోలీసులు కోర్టుకు తెలిపారు.దీంతో అనురాధను చంపేందుకు చంద్రమోహన్ ప్లాన్ చేసుకున్నట్లు వివరించారు.

రోజంతా ఇంట్లోనే డెడ్​బాడీ.. 

ఈ నెల12న మధ్యాహ్నం అనురాధతో గొడవపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు అందించారు. హత్య చేసిన రోజంతా అనురాధ డెడ్‌‌బాడీని ఇంట్లోనే బయటపెట్టినట్లు తెలిపారు.అనురాధ గది పక్కన అద్దెకు ఉన్న వారు ఇంట్లో లేని టైమ్​లో 13న ఆమె డెడ్‌‌బాడీని ముక్కలు చేసినట్లు వెల్లడించారు.మొండెం, కాళ్ళు,చేతులను సూట్‌‌కేస్‌‌లో ప్యాక్‌‌ చేసి  ఫ్రిజ్‌‌లో భద్రపరిచినట్లు తెలిపారు.15న అనురాధ తలను ఆటోలో తీసుకెళ్లి మూసీనది ఒడ్డున పడేసినట్లు వివరించారు.అనురాధ సెల్‌‌ఫోన్‌‌ నుంచి ఆస్ట్రేలియాలోని ఆమె కూతురుకు మెసేజ్‌‌లు చేసినట్లు తెలిపారు.చార్‌‌‌‌ధామ్‌‌లో వెళ్తున్నట్లు సీన్ క్రియేట్‌‌ చేసి సెల్‌‌ఫోన్‌‌ను అక్కడే పడేసేందుకు స్కెచ్ వేశాడని రిమాండ్‌‌ రిపోర్టులో తెలిపారు.ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు.కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.