
లక్సెట్టిపేట, వెలుగు: ష్యూరిటీ ఇచ్చిన ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ రెకేందర్ రవి(45) ఆరేళ్ల కింద ఫైనాన్స్‌లో ఒక లారీ తీసుకున్నాడు.
అతడితో పాటు ఆయన బంధువు జీవన్ కొడుకు రాజు కూడా అదే ఫైనాన్స్ లో లారీ తీసుకోగా, రవి అతడిని ష్యూరిటీ ఇచ్చాడు. రవి ఫైనాన్స్ డబ్బులు పూర్తిగా చెల్లించి, ఇటీవల లారీని అమ్ముకున్నాడు. లారీకి క్లియరెన్స్ కోసం ఫైనాన్స్ వాళ్లను సంప్రదించగా, రాజు తీసుకున్న ఫైనాన్స్ కిస్తీలు సరిగా కట్టడం లేదని తెలిపారు.
అతడి డబ్బులు కడితే క్లియరెన్స్ ఇస్తామని తెలపడంతో, మృతుడు రాజును డబ్బులు కట్టమని అడిగాడు. డబ్బులు కట్టనని ఏం చేసుకుంటావో చేసుకోమని రాజు చెప్పడంతో రవి మనస్తాపంతో ఈ నెల 5న ఇంట్లో ఉరేసుకున్నాడు. వరంగల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. మృతుడి కొడుకు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.