
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి కౌంట్ డౌన్ మొదలైంది. శోభాయాత్ర ట్యాంక్ బండ్ చేరుకుంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర.. భారీ క్రేన్ సాయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెల్లవారుజాము నుంచే మొదలైన శోభాయాత్ర లక్షల మంది భక్తుల బై బై గణేషా నినాదాలతో సాగింది.
షెడ్యూల్ ప్రకారం.. అనుకున్న సమయానికి ట్యాంక్ బండ్ చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేషుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక భారీ గణనాథుడిని చివరి సారిగా చూసేందుకు లక్షల మంది భక్తులు ట్యాంక్ బండ్ చేరుకున్నారు. జై గణేశా.. జై జై గణేశా.. బై బై గణేశా అంటూ జనం నినాదాలతో హోరెత్తుతోంది ట్యాంక్ బండ్.
అంతకు ముందు సెప్టెంబర్ 6న ఉదయం 7: 30గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 11:30గంటల వరకు జరిగింది. భక్తుల పరివారంతో నగర వీధుల్లో ఊరేగుతూ టెలిఫోన్ భవన్- ఇక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం మీదుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నంబర్ 4 దగ్గరకు వరకు జరిగింది.లక్షలాది మంది భక్తులు జై జై గణేశా.. బై బై గణేశా అంటూ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు.